మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టు అతి త్వరలో ఆమోదం: ఎంపీ బాలశౌరి

భారత్ న్యూస్ విశాఖపట్నం..మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టు అతి త్వరలో ఆమోదం: ఎంపీ బాలశౌరి

రూ. 2,816 కోట్ల వ్యయంతో చేపట్టనున్న కొత్త మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టుకు అతి త్వరలో ఆమోదం లభించనుంది అని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు.

మచిలీపట్నం (కృష్ణా జిల్లా) నుండి రేపల్లె (గుంటూరు జిల్లా) వరకు విస్తరించి ఉండే, 47.60 కిలోమీటర్ల ఈ కొత్త బ్రాడ్-గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన పరిపాలనాపరమైన ఆమోదాలు త్వరలోనే లభించనున్నాయని ఆయన పేర్కొన్నారు.

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌కు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే రూట్‌ను భారత రైల్వే శాఖ తన అట్లాస్ మ్యాప్‌లో అధికారికంగా అప్‌డేట్ చేసింది.

ఈ రూట్ ప్రకారం పెనుమూడికి దక్షిణంగా దివిసీమ ప్రాంతాన్ని అనుసంధానిస్తూ అత్యంత కీలకమైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ బ్రిడ్జి ద్వారా కృష్ణా–గుంటూరు జిల్లాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.

ప్రతిపాదిత రైల్వే స్టేషన్లు: పెనుమూడి, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, మాజేరు, రుద్రవరం.

ఈ ప్రాజెక్టు నిర్మాణం నాలుగు సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు
బాలశౌరి తెలిపారు.

మచిలీపట్నం -రేపల్లె రైల్వే లైను ముఖ్యాంశాలు

  • రూ. 2,816 కోట్ల విలువైన మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టుకు అధికారిక ఆమోదం అతి త్వరలో లభించనుంది.
  • 47.60 కిలోమీటర్ల ఈ బ్రాడ్-గేజ్ లైన్, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నాన్ని గుంటూరు జిల్లాలోని రేపల్లెతో కలుపుతుంది.
  • ఈ ప్రాజెక్టులో భాగంగా ఆరు కొత్త రైల్వే స్టేషన్లు, 70 వంతెనలు, మరియు అధునాతన వ్యవస్థలతో కూడిన 24 అండర్-బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుంది.
  • నిర్మాణం త్వరలో ప్రారంభమై నాలుగేళ్లలో పూర్తి అవుతుందని, తద్వారా ప్రాంతీయ అనుసంధానం మెరుగుపడుతుందని అంచనా.

ఈ ప్రాజెక్ట్ కోసం తీవ్రంగా కృషి చేసిన ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపిన వివరాల ప్రకారం
మచిలీపట్నం రేపల్లె రైల్వే లైను తుది స్థల సర్వే పూర్తయిందని, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిందని ఎంపీ బాలశౌరి ధృవీకరించారు. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు కాగా, నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. మచిలీపట్నం, రేపల్లె మరియు దివి సీమ ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్టు ఆమోదానికి సహకరించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ రైల్వే శాఖకు మరియు సంబంధిత అధికారులకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఎంపీ కార్యాలయం
మచిలీపట్నం