భారత్ న్యూస్ శ్రీకాకుళం….కృష్ణానదిపై బ్యారేజీల నిర్మాణంతోనే రైతు సంక్షేమం
ప్రతి ఏటా నీటి అతివృష్టి, అనావృష్టి. ఏ ఒక్కటి వచ్చినా నష్టపోతున్న దిగువప్రాంత రైతాంగం

Ammiraju Udaya Shankar.sharma News Editor…వందల టిఎంసీలు నీరు సముద్రం పాలు
ఫైనాన్స్ డిపార్ట్మెంటు వద్ద బ్యారేజీల ఫైల్
రైతు నాయకులు స్థానిక పాలకుల చేత ఫైలును ముందుకు నడిపించాలి
మొక్కజొన్న కొనుగోళ్లో కదలని డబుల్ ఇంజన్ ప్రభుత్వం
రాష్ట్ర రైతు విభాగం రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
చల్లపల్లి:
కృష్ణానది దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలకు ఏర్పడే నీటి సమస్యను బ్యారేజీల నిర్మాణంతోనే అధిగమించగలమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి సమావేశాలు చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో గురువారం ప్రారంభమయ్యాయి. ఎపి రైతు సంఘం అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన సభలో ప్రత్యేక అధితిగా పాల్గొన్న సింహాద్రి రమేష్బాబు రైతు సమస్యలు, వాటి పరిష్కారాలపై మాట్లాడారు. తాము మొదటి నుంచి రైతు పక్షపాతులమని అనేక సందర్భాల్లో రైతు సమస్యలపై పోరాటాలు కూడా చేసామని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గానీ, అందులోనూ అవనిగడ్డ నియోజకవర్గం గానీ భౌగోళికంగా చిట్టచివరన ఉండటంతో భారీ వర్షాలు పడినా, తుఫానులు వచ్చినా పంటలు మునిగిపోతాయని, అలాగే వర్షాలు పడకపోతే సాగు నీరు లభించక పొలాలు ఎండిపోతాయని అన్నారు. ప్రతి ఏటా రెండు విపత్తుల్లో ఏదో ఒకదానితో రైతులు తీవ్రంగా పంట నష్టపోతున్నారని ఆవేధన వ్యక్తంచేశారు.
నీటి అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల నుంచి రైతులకు శాశ్వతంగా విముక్తి కల్గించేందుకు, కృష్ణానదిలో వృధాగా సముద్రంలో కలిసిపోతున్న వందలాది టీఎంసీల నీటిని ఒడిసి పట్టేందుకు జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. కృష్ణానది దిగువున కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం బొబ్బర్లంక వద్ద ఒకటి, చోడవరం వద్ద మరొకటి మొత్తం రెండు చెక్ డ్యాములు ఏర్పాటు ఆవశ్యకతను జగన్మోహనరెడ్డి దృష్టిలో పెట్టామన్నారు. బొబ్బర్లంక, చోడవరం ప్రాంతాల వద్ద చెక్ డ్యాములను నిర్మిస్తే ఈ ప్రాంతం సాగునీటి సమస్యను అధిగమించి సశ్యశ్యామలం అవుతుందని వివరించానన్నారు. కోరిందే తడవుగా జగన్మోహన్రెడ్డి వెంటనే అదే రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అధికారులను, మంత్రులను పిలిచి చర్చించినప్పుడు కృష్ణానదిపై చెక్ డ్యాములు కడితే కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంటుందని చెక్ డ్యాముల స్థానంలో బ్యారేజిలను ‘నిర్మించాలని అధికారులు సూచించినట్లు వివరించారు. బ్యారేజీల నిర్మాణం కోసం మట్టి నమూనాల సేకరించటం, బొబ్బర్లంక వద్ద బ్యారేజీ నిర్మాణానికి 2200 కోట్లు అవుతుందని అంచనాలు రూపొందించారన్నారు. ప్రస్తుతం ఆ ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంటు వద్ద ఉందని పార్టీలతో సంబంధం లేకుండా రైతుల అవసరంగా భావించి రైతునాయకులు పూనుకుని స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా పైనాన్స్ డిపార్ట్మెంటు వద్ద పెండింగ్లో ఉన్న ఫైల్ను ముందుకు నడిపించి బ్యారేజీల నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. బ్యారేజీల నిర్మాణం జరిగితే బొబ్బర్లంక వద్ద 5.57 టిఎంసిల నీటిని, చోడవరం వద్ద 3.5 టిఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే డెల్టా, దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలకు నీటి కొరత ఉండదని వివరించారు. పోలవరం నుంచి నీళ్ళు రాకపోయినా… మరెక్కడి నుంచి నీరు రాకపోయినా ఇక్కడ బ్యారేజీల్లో నిల్వ ఉన్న నీరే సమృద్దిగా సరిపోతుందని వివరించారు. ఇక ప్రతిఏటా అన్నదాతలు సాటునీటి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండబోదన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా రైతుల అవసరంగా భావంచి ఫైనాన్స్ డిపార్ట్మెంటు వద్ద ఉన్న ప్రాజెక్టుల ఫైళ్ళను బయటకు తీయించి ప్రాజెక్టుల నిర్మాణాలకు కృషి చేయాలనీ కోరారు.
డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో రైతుకు ఏమిలాభం?
పక్కనున్న తెలంగాణాలో డబుల్ ఇంజన్ గవర్నమెంటు కాకపోయినా మొక్కజొన్నను ప్రభుత్వం మద్దతు ధరకు కొంటోందని కానీ అంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం మద్దతు ధరకు ఎందుకు కొనలేకపోతోందని ప్రశ్నించారు. దీనిపై మాట్లాడే నాయకులే లేకపోవటం బాధాకరమన్నారు. 12.40లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేపట్టారని, ప్రతి ఎకరాలకు సగటున 35 క్వింటాళ్ళు దిగుబడి వచ్చిందన్నారు. మద్దతు ధరకు కొనుగోలు ధరకు మద్య న్న వ్యత్యాసాన్ని చెల్లించాలని కేంద్రాని 40 రోజుల వ్యవధిలో రెండు సార్లు అదే లెటర్ రాసారన్నారు. లెటర్లు రాయటం వల్ల కంటి తుడుపు చర్యలేగానీ ఎవరికి మేలు జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు కోనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినా అవి దళారులకు ఉపయోగపడతాయే తప్ప రైతులకు ఏరకంగానూ ఉపయోగపడవని అన్నారు.
