భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీలో కారు బాంబు పేలుడు… సూత్రధారి డాక్టర్ ఉమర్ ఫొటో విడుదల
ఢిల్లీ ఎర్రకోట వద్ద కారులో భారీ పేలుడు
ఘటనలో 9 మంది మృతి.. 20 మందికి పైగా గాయాలు
సూత్రధారి డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫొటో విడుదల చేసిన పోలీసులు
పుల్వామాలో అదుపులోకి ఉమర్ కుటుంబ సభ్యులు
ఆత్మాహుతి దాడి కోణంలో పోలీసుల దర్యాప్తు
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడు కేసులో కీలక పురోగతి లభించింది. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫొటోను పోలీసులు తొలిసారిగా విడుదల చేశారు. ఈ భీకర పేలుడులో 9 మంది మృతి చెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నెమ్మదిగా వెళుతున్న హ్యుందాయ్ ఐ20 కారులో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు కారు ముక్కలైంది. ఆ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం కావడంతో ఎర్రకోటకు సెలవు ప్రకటించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, లేదంటే ప్రాణనష్టం భారీగా ఉండేదని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. “గాయపడిన వారి శరీరాలపై పేలుళ్లలో సాధారణంగా కనిపించే పదునైన వస్తువులు లేదా గాట్లు ఏవీ లేవు. ఇది కాస్త అసాధారణంగా ఉంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశాం” అని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్ వంటి శక్తిమంతమైన పేలుడు పదార్థాల మిశ్రమాన్ని వాడినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ పేలుడుకు కొన్ని గంటల ముందే ఫరీదాబాద్‌లో ఓ కశ్మీరీ వైద్యుడు అద్దెకు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. జమ్మూకశ్మీర్, హర్యానా, యూపీ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఈ దాడుల్లో సుమారు 360 కిలోల అమ్మోనియం నైట్రేట్, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు పుల్వామాలో ఉన్న డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, పేలుడులో సూత్రధారి ఉమర్ మరణించాడా? లేక పరారీలో ఉన్నాడా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.