Convenient services for passengers and welfare of staff is the mission of the government.

భారత్ న్యూస్ హైదరాబాద్….

ప్ర‌యాణికులకు సౌక‌ర్య‌వంత సేవ‌లు, సిబ్బంది సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం

అందుబాటులోకి వచ్చిన ఎక్స్ ప్రెస్, స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ బస్సులు

లాంఛనంగా ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు

త్వరలోనే 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను సీఎం రేవంత్‌ రెడ్డి గారు ప్రారంభిస్తామని ప్రకటన

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు అత్యాధునిక హంగులతో అందుబాటులోకి తెచ్చిన కొత్త ఎక్స్ ప్రెస్, లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్‌ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి గారు, హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి గారు, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్ గారు, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారితో కలిసి ఆయన ‌కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కొత్త బస్సులో కలిసి వారంతా ప్రయాణించారు. 

ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ.. ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొత్త బస్సులను టీఎస్ఆర్టీసీ కొనుగోలు చేయడం శుభపరిణామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్ కు మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తోందని చెప్పారు. ఈ స్కీమ్‌ ను ప్రవేశపెట్టిన 20 రోజుల్లోనే ఆరు కోట్ల మంది మహిళలు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులను కోనుగోలు చేసి వాటిని సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి గారి చేతులు మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కొత్త బ‌స్సులు గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయ‌ని చెప్పారు. 

ఒకవైపు ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూనే.. ఉద్యోగుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేస్తామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న పీఎఫ్, సీసీఎస్‌ బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్య‌మ స‌మయంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మ‌ర‌చిపోలేనిదంటూ నాటి రోజుల్ని గుర్తు చేస్తూ సంస్థ అభ్యున్న‌తి కోసం భ‌విష్య‌త్తు కార్యాచ‌ణ‌ను రూపొందించ‌డం జ‌రుగుతోంద‌ని, సిబ్బంది సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని స్పష్టం చేశారు.

ఆధునిక సదుపాయాల‌తో రూపుదిద్దుకున్న 50 కొత్త బస్సులు నేటి నుంచి ర‌వాణా సేవ‌ల్ని అందిస్తాయ‌ని చెబుతూ మిగ‌తా  AC/నాన్-AC స్లీపర్ కమ్ సీటర్, రాజధాని బస్సులు జనవరి 2024 చివరి నాటికి, ఎక్స్‌ప్రెస్/పల్లెవెలుగు కొత్త బస్సులు జూన్ 2024 చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయ‌ని వెల్ల‌డించారు. పెరుగుతున్న ర‌ద్దీకి అనుగుణంగా ప్ర‌యాణికుల‌కు సౌక‌ర్య‌వంత‌మైన సేవ‌లు అందించేందుకు త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో బ‌స్సు స‌ర్వీసుల‌ను అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు చెప్పారు. అన్ని బ‌స్టాండుల‌లో సౌక‌ర్యాలు, స‌దుపాయాల‌ను మ‌రింత మెరుగుప‌ర‌చ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. టీఎస్‌ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించే మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త ఉంటుంద‌ని చెబుతూ సామాన్య, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఆర్టీసీ తోడుగా ఎప్పుడూ ఉంటుంద‌ని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్ర‌యాణికులకు మెరుగైన సదుపాయాల క‌ల్ప‌న‌లో గాని, సిబ్బంది సంక్షేమ విష‌యంలో గాని ఈ ప్ర‌భుత్వం కృత‌ నిశ్చ‌యంతో ప‌ని చేస్తోంద‌న్నారు. మహాలక్ష్మి స్కీమ్ చక్కగా అమలవుతోందని, సిబ్బంది నిబద్దతతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని ప్రశసించారు. టీఎస్ఆర్టీసీ ప్రజల సంస్థ అని, ప్రజలందరూ దానిని కాపాడుకోవాలన్నారు.

హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ స‌గ‌టు జీవి జీవితంలో భాగ‌స్వామ్యంగా ఉన్న ఆర్టీసీ గొప్ప సంస్థ అని కొనియాడారు. ఆర్టీసీ సేవ‌ల్ని వినియోగించుకోని వారు ఎవ‌రూ ఉండ‌ర‌ని చెప్పారు. అలా అంద‌రి జీవితాల్లో మిలిత‌మై ఉందని కితాబిస్తూ తాను ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించానంటూ గుర్తు చేశారు. ప్రైవేట్ వాహ‌నాలు, ఆటోల‌లో ప్ర‌యాణించ‌డానికి మ‌హిళ‌లు చాలా ఇబ్బంది ప‌డేవారంటూ ఇప్పుడు ప్ర‌భుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం సేవ‌ల్ని వినియోగించుకుంటున్నార‌ని పేర్కొన్నారు. ఈ స్కీమ్‌ ప్రశాంతంగా అమలు అయ్యేందుకు పోలీస్‌ శాఖ నుంచి టీఎస్‌ఆర్టీసీకి సహాయ సహాకారాలు ఉంటాయని చెప్పారు.

సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ వీసీ స‌జ్జ‌న‌ర్‌, ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ, “ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది” అన్నారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కంలో భాగంగా ప్ర‌భుత్వం అందిస్తున్న బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌ ఉచిత ప్ర‌యాణానికి మంచి స్పంద‌న ల‌భిస్తోంద‌ని, ఈ నెల 9 వ తేదిన ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన తర్వాత ఈ సేవ‌ల్ని ఎక్కువ‌గా వినియోగించుకోవ‌డం జ‌రగుతోంద‌ని చెప్పారు. గ‌తంలో 69 శాతం ఉన్న ఒ.ఆర్ ప్ర‌స్తుతం 88 శాతం న‌మోదు అవుతోంద‌ని, కొన్ని డిపోల‌లో 100 శాతం రావ‌డం కూడా రావ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఇతర రాష్ట్రాలలో ఎక్కువ స‌మ‌యం ప‌డితే మ‌న రాష్ట్రంలో ప్రభుత్వ ఆదేశాల‌తో సంస్థ యంత్రాంగం కృషితో కేవలం 48 గంట‌ల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో  92- AC/నాన్-AC స్లీపర్ కమ్ సీటర్ బ‌స్సులు,  46- AC రాజధాని, 912- ఎక్స్‌ప్రెస్/పల్లెవెలుగు బస్సులు,  మొత్తం 1050 బ‌స్సుల‌ను ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం ప్రవేశపెడుతోందన్నారు. 

ఈ ప్రారంభోత్సవంలో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి, టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, వినోద్‌ కుమార్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ఫ, సీఎంఈ రఘునాథ రావు, డీసీపీ సెంట్రల్ జోన్ శరత్ చంద్ర పవార్, జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాండు రంగ నాయక్, ఎస్బీఐ డీజీఎం విజయ నాగేంద్ర, బస్ బాడీ బిల్డర్ అసోసియేన్ ప్రెసిడెంట్ శ్రీనివాసన్, తదితరులు పాల్గొన్నారు.

పీఆర్వో, టీఎస్ఆర్టీసీ