రూ. 1,06,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన మరియు జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

Bharath News HYD.

రూ. 1,06,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన మరియు జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
• సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అనగా మార్చి12, 2024 న, గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రెండవ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్‌ను గౌరవ కేంద్ర రైల్వే కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారి మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో జెండా ఊపి ప్రారంభించారు. గౌరవ ప్రధాన మంత్రి 10 కొత్త వందే భారత్ రైళ్లను మరియు ప్రస్తుతం ఉన్న 4 వందే భారత్ రైళ్లను పొడిగింపును జెండా ఊపి ప్రారంభించారు. రూ.1,06,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి దేశానికి అంకితం చేశారు.
అదే సమయంలో ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీ లైన కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్, జనరల్ మేనేజర్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు; సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ భరతేష్ కుమార్ జైన్ మరియు ఇతర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బహుళ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపనతో ‘విక్షిత్ భారత్’ సృష్టి కోసం అభివృద్ధి పనులు నిరంతరం విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నేటి కార్యక్రమంలో సుమారు రూ. 1 లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం మరియు శంకుస్థాపన చేయడం జరిగిందని ఇందులో దాదాపు రూ. 85,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను రైల్వేలకు అంకితం చేయడం జరిగిందని తద్వారా విక్షిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో కీలకమైన ముందడుగు వేశామని అని తెలియజేశారు.

2014 సంవత్సరం నుండి సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను చేర్చడం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ దీనివల్ల సాధారణ బడ్జెట్ నుండి రైల్వేల అభివృద్ధికి వనరులను అందించడం సాధ్యమైందని తెలిపారు . ప్రధాన మంత్రి 2014 సంవత్సరానికి పూర్వం సమయపాలన, పరిశుభ్రత మరియు సాధారణ సౌకర్యాల కొరతతో పాటు, ఈశాన్య రాష్ట్రాలలోని 6 రాజధానులకు రైల్వే అనుసంధానం లేదని మరియు 10,000 కంటే ఎక్కువ మానవరహిత రైల్వే క్రాసింగ్‌లు ఉండేవని , కేవలం 35 శాతం మాత్రమే రైల్వే లైన్లు విద్యుద్దీకరణ చేయబడినాయని మరియు రైల్వే రిజర్వేషన్లు అవినీతి మరియు పొడవైన వరుసలు కారణంగా దెబ్బతిన్నాయని తెలియజేశారు .
ప్రధాన మంత్రి ప్రసంగాన్ని కొనసాగిస్తూ , “రైల్వేలను ఆ అసౌకర్యమైన పరిస్థితుల నుండి బయటకు తీసుకురావడానికి మా ప్రభుత్వం సంకల్ప శక్తిని ప్రదర్శించింది. ఇప్పుడు రైల్వేల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటి”. ప్రధానమంత్రి 2014 నుండి బడ్జెట్ కేటాయింపులో ఆరు రెట్లు పెంపు వంటి చొరవలను తెలియజేస్తూ మరియు రాబోయే 5 సంవత్సరాలలో, రైల్వేల భారీ పరివర్తన వారి ఊహకు మించి ఉంటుందని దేశప్రజలకు హామీ ఇచ్చారు. “ఈ 10 సంవత్సరాల పని కేవలం ట్రైలర్ మాత్రమే. నేను చాలా దూరం
వెళ్ళాలి” అని అన్నారాయన. చాలా రాష్ట్రాలలో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టబడినాయని అవి వందేభారత్ రైళ్ల శతాబ్దానికి ఇప్పటికే గొప్ప విజయమని తెలియజేశారు. వందే భారత్ వ్యవస్థ దేశంలోని 250 జిల్లాలకు విస్తరించిందని మరియు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వందే భారత్‌కు సంబంధించిన మార్గాలను పొడిగించడం జరుగుతోందని తెలిపారు.

దేశాన్ని అభివృద్ధి పధంలోకి తీసుకొని వెళ్ళడానికి మరియు ఆర్థికంగా సమర్థంగా పరివర్తన చెందడానికి రైల్వేల కీలక పాత్రను పేర్కొంటూ, “రైల్వే పరివర్తన విక్షిత్ భారత్ హామీ” అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రధాన మంత్రి వేగంగా రైల్వే ట్రాక్‌లను నిర్మించడం, 1300 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధి, భావి తరాల రైళ్లయిన వందే భారత్, నమో భారత్ మరియు అమృత్ భారత్ వంటి రైళ్లను ప్రారంభం చేయడం మరియు ఆధునికీకరించిన రైల్వే ఇంజిన్‌లను మరియు కోచ్ ఫ్యాక్టరీలు ఆవిష్కరించడం ద్వారా రూపాంతరం చెందుతున్న రైల్వేల ముఖచిత్రాన్ని వెలుగులోకి తెచ్చారు .
ప్రధాన మంత్రి గ‌తి శ‌క్తి కార్గో టెర్మిన‌ల్ పాల‌సీ ద్వారా , ల్యాండ్ లీజింగ్ విధానాన్ని సుల‌భ‌ర‌పరిచి, ఆన్‌లైన్‌లో పారదర్శకతకు దారితీసినందున కార్గో టెర్మినల్ నిర్మాణం పెరిగిందని అన్నారు. గతి శక్తి యూనివర్సిటీ ఏర్పాటు గురించి కూడా ప్రస్తావించారు. రైల్వే ఆధునికీకరణ-సంబంధిత కార్యక్రమాలను ప్రధాన మంత్రి కొనసాగించారు మరియు కాపాలలేని లెవెల్ క్రాసింగ్ రద్దు మరియు ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థలను చేపట్టే ప్రాజెక్ట్ గురించి తెలియజేశారు. 100 శాతం విద్యుదీకరణ దిశగా దేశం దూసుకుపోతోందని మరియు స్టేషన్లలో సౌరశక్తితో నడిచే స్టేషన్లు మరియు జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయబడుతున్నాయని పేర్కొన్నారు.

“ఈ రైల్వే రైళ్లు, ట్రాక్‌లు మరియు స్టేషన్‌ల నిర్మాణం మేడ్ ఇన్ ఇండియా పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తోంది” అని ప్రధాన మంత్రి అన్నారు. శ్రీలంక, మొజాంబిక్, సెనెగల్, మయన్మార్, సూడాన్ వంటి దేశాలకు మేడ్ ఇన్ ఇండియా లోకోమోటివ్‌లు, కోచ్‌లు ఎగుమతి అవుతున్నాయని ఆయన తెలియజేశారు. మేడ్ ఇన్ ఇండియా సెమీ హైస్పీడ్ రైళ్లకు డిమాండ్ పెరగడం వల్ల ఇలాంటి అనేక కర్మాగారాలు ఆవిర్భవించనున్నాయన్నారు. “రైల్వే పునరుద్ధరణ, కొత్త పెట్టుబడులు కొత్త ఉపాధి అవకాశాలకు హామీ ఇస్తాయి” అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమాలను ఎన్నికలతో ముడిపెడుతున్న వారిని ప్రధాని విమర్శించారు. “మాకు, ఈ అభివృద్ధి ప్రాజెక్టులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాదు, అవి దేశ నిర్మాణ లక్ష్యం”. పూర్వపు తరాల సమస్య రాబోయే తరానికి ఎదురుకాదని, ‘ఇది మోదీ హామీ’ అని ఆయన అన్నారు
గడచిన 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధికి ఉదాహరణగా తూర్పు మరియు పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్‌లను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. గూడ్స్ రైళ్ల కోసం ఈ ప్రత్యేక ట్రాక్ వేగాన్ని మెరుగుపరుస్తుంది మరియు వ్యవసాయం, పరిశ్రమలు, ఎగుమతి మరియు వ్యాపారానికి ముఖ్యమైనది. గత 10 సంవత్సరాలలో, తూర్పు మరియు పశ్చిమ తీరాలను కలుపుతూ ఈ సరుకు రవాణా కారిడార్ దాదాపుగా పూర్తయింది. ఈరోజు దాదాపు 600 కిలోమీటర్ల ఫ్రైట్ కారిడార్ ప్రారంభించబడింది మరియు అహ్మదాబాద్‌లో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించబడింది. ప్రభుత్వ కృషి వల్ల ఈ కారిడార్‌లో గూడ్స్ రైళ్ల వేగం ఇప్పుడు రెండింతలు పెరిగిందని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొత్తం కారిడార్‌లో పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈరోజు, రైల్వే గూడ్స్ షెడ్, గతి శక్తి మల్టీమోడల్ కార్గో టెర్మినల్, డిజిటల్ కంట్రోల్ స్టేషన్, రైల్వే వర్క్‌షాప్, రైల్వే లోకో షెడ్ మరియు రైల్వే డిపో కూడా చాలా చోట్ల ప్రారంభించబడ్డాయి. ఇది సరుకు రవాణాపై కూడా చాలా సానుకూల ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

“భారతీయ రైల్వేలను ఆత్మనిర్భర్ భారత్ మరియు ఓకల్ ఫర్ లోకల్ చేయడమే ప్రభుత్వ లక్ష్యం ”తో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్కీమ్‌లో ఇప్పటికే 1500 స్టాల్స్ తెరవబడ్డాయి తద్వారా దేశంలోని విశ్వకర్మలు, హస్తకళల పురుషులు మరియు మహిళా స్వయం సహాయక బృందాలు తయారు చేసిన ఉత్పత్తులను ఇప్పుడు రైల్వే స్టేషన్‌లలో విక్రయించనున్నట్లు ప్రధాన మంత్రి తెలియజేశారు.

భారతీయ రైల్వే అభివృద్ధితో పాటు వారసత్వ మంత్రాన్ని సాకారం చేసుకుంటూ ప్రాంతీయ సంస్కృతి, విశ్వాసాలకు సంబంధించిన పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. “ఈరోజు రామాయణ సర్క్యూట్, గురు-కృపా సర్క్యూట్ మరియు జైన్ యాత్రలో భారత్ గౌరవ్ రైళ్లు నడుస్తుండగా, ఆస్తా ప్రత్యేక రైలు దేశంలోని నలుమూలల నుండి శ్రీరామ భక్తులను అయోధ్యకు తీసుకువెళుతోంది” అని ప్రధాని మోదీ చెప్పారు. సుమారు 350 ఆస్తా రైళ్లు ద్వారా అయోధ్యలో రామలల్ల దర్శనం కోసం ఇప్పటికే 4.5 లక్షల మందికి పైగా భక్తులను తీసుకువెళుతున్నారని తెలియజేశారు.

ప్రధాన మంత్రి ప్రసంగాన్ని ముగిస్తూ , “భారతీయ రైల్వేలు ఆధునికత వేగంతో ముందుకు సాగుతూనే ఉంటాయని. ఇది మోదీ హామీ.” ఈ అభివృద్ధి వేడుకలను కొనసాగించేందుకు పౌరులు సహకరించాలని పిలుపునిచ్చారు.
గౌరవ రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ప్రసంగిస్తూ, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైల్వేల అభివృద్ధిపై దృష్టి సారించి, ‘విక్షిత్ భారత్’ కలను సాకారం చేసుకునేందుకు మార్గంగా మార్చారని అన్నారు. గత పదేళ్లలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ విభాగాల్లో 2,500 కిలోమీటర్లకు పైగా ట్రాక్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కారిడార్లలో ప్రతిరోజూ సుమారు 300 రైళ్లు నడపబడుతున్నాయని తద్వారా దేశానికి ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన చెప్పారు. విక్షిత్ భారత్ విజన్‌లో సాంకేతికతకు కూడా పెద్దపీట వేస్తున్నట్లు గౌరవ రైల్వే మంత్రి పేర్కొన్నారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ సెక్షన్‌లలో సరకు రవాణా రైలు కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గౌరవ కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లలో రైల్వేలు పెద్దఎత్తున అభివృద్ధిని సాధించాయని అన్నారు. నేడు రూ. 85,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు ను గౌరవ ప్రధానమంత్రి ప్రారంభిస్తున్నారని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే అధికార పరిధిలోని ప్రాజెక్టులలో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ యూనిట్లు (ఓ.ఎస్.ఓ . పి ), పి. ఏం. గతి శక్తి కార్గో టెర్మినల్స్, గూడ్స్ షెడ్‌లు, జన్ ఔషది కేంద్రాలు, రెండవ రైల్వే లైన్, మూడవ రైల్వే లైన్, గేజ్ మార్పిడి మరియు బైపాస్ లైన్‌లు మరియు రైల్ కోచ్ రెస్టారెంట్‌లు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ రోజు అదనంగా, సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్; కలబురగి – బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ (దక్షిణ మధ్య రైల్వే గుండా వెళుతుంది) మరియు కొల్లాం – తిరుపతి మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లను జెండా ఊపి ప్రారంభం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మరియు చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు త్వరలో పూర్తవుతాయని తెలిపారు.

సికింద్రాబాద్ స్టేషన్‌లో జరిగిన కార్యక్రమం ప్రారంభంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ స్వాగతోపన్యాసం చేశారు.