ఏప్రిల్‌ 11న ఏఐకెఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి

ఏప్రిల్‌ 11న ఏఐకెఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి
పోస్టర్‌ ఆవిష్కరణలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. సాగర్‌ పిలుపు

ఏప్రిల్‌ 11న అఖిల భారత కిసాన్‌ సభ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణలు, సభలు, సమావేశాలు గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌ పిలుపునిచ్చారు.
ఆర్‌టిసి క్రాస్‌ రోడ్స్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఎప్రిల్‌ 11 ఏఐకెఎస్‌ ఆవిర్భావ దినోత్సవం పోస్టర్లను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌, ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాద్‌రావు, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, నాయకులు టి. కిషోర్‌, ఆంజనేయులు ఆవిష్కరించారు. అనంతరం సాగర్‌ మాట్లాడుతూ… ఏఐకెఎస్‌ 1936 ఏప్రిల్‌ 11న ఏర్పడిరది. జాతీయోద్యమంలో భాగంగా ఆవిర్భవించిన ఏఐకెఎస్‌ ఒకవైపు బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే మరోవైపు జమీందార్లు, జాగీర్‌దార్లకు వ్యతిరేకంగా సంస్థానాల్లో పోరాటాలను నిర్వహించింది. అర్హులైన పేదలకు భూమి దక్కలని, కౌలు రేట్లు తగ్గించాలని, గ్రామీణ ప్రాంతాల్లో సాగు చేస్తున్న రైతుల రుణాలను మాఫీ చేయాలని, అనేక ప్రాంతీయ డిమాండ్‌లను తీసుకొని నిరంతరం పోరాటం చేసినది అఖిల భారత కిసాన్‌ సభ. దీని ఆవిర్భావంలోనే జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించిన నాయకులు కిసాన్‌ సభకు నాయకత్వం వహించారు. స్వామి సహజనంద సరస్వతి మొదటి అధ్యక్షునిగా, ఎన్‌.జి రంగ కార్యదర్శిగా ఈ సంఘం ఆవిర్భవించింది. ఆవిర్భవ కాలంలోనే ఈ.యం.ఎస్‌ నంబూద్రిపాద్‌, సుందరయ్య లాంటి అనేక మంది జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్‌ 11వ తేదీన దేశవ్యాప్తంగా కిసాన్‌ సభ జెండాలను ఆవిష్కరించి అదే సందర్భంలో సభలు, సమావేశాల ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే విధానాన్ని బహిర్గతం చేయాలని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చట్టాలను వెనక్కి తీసుకుంటూనే చాపకింద నీరులా అమలు చేయడానికి పూనుకుంటుంది. విద్యుత్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌లో పెట్టింది. యావత్‌ భారత ప్రజానీకానికి నష్టం చేసే విధానాలను కేంద్ర అవలంభిస్తుంది. ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంలో రైతుల రుణాల గురించి మాట్లాడడం లేదు. కనీస మద్దతు ధరల చట్టం కావాలనే దాని గురించి మాట్లాడడం లేదు. సమస్యల పరంపర కొనసాగుతున్న సందర్భంలో ఆపే ప్రయత్నం చేయడం లేదని, కేంద్రం యొక్క విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా ఏప్రిల్‌ 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండల, జిల్లా కేంద్రాలలో సభలు, సమావేశాలు నిర్వహించాలని, రైతాంగం కలిసొచ్చే రైతు సంఘాలను కలుపుకొని ఆందోళన పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.