The minimum support price of pepper should be announced at 25 thousand rupeesMarket exploitation should be stopped

..Bharathnews.hyd,,,,,,

మిర్చి కనీస మద్దతు ధర 25 వేల రూపాయలు ప్రకటించాలి

మార్కెట్ దోపిడిని అరికట్టాలి

మిర్చి తాలుకాయకు జెండా పాట పెట్టాలి

ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

ఎనుమాముల మార్కెట్ ను సందర్శించిన రైతు సంఘాల ప్రతినిధి బృందం

రైతులు పండించిన మిర్చి పంట క్వింటాకు 25 వేల రూపాయల కనీస మద్దతు ధర ప్రకటించి, మార్కెట్ దోపిడి అరికట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
 ఈరోజు అఖిలభారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర బాధ్యులు గోనె కుమారస్వామి, ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండి ఇస్మాయిల్ కుసుంబ బాబూరావు తదితరుల బృందం మిర్చి యార్డు పర్యటించి ధరల పరిస్థితి రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు మిర్చి రేటు తగ్గడంతో తమకు తీవ్రంగా అన్యాయం జరిగిందని నాయకులతో తమ వేదనను వెలిబుచ్చారు కుంటి సాకులతో ధరలు తగ్గిస్తున్నారని తెలిపారు.

అనంతరం ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండో మార్కెట్ అయినా ఏనుమాములలో అంతర్జాతీయ మార్కెట్ అనుగుణంగా మిర్చికి ధర పలకకపోవడం అన్యాయం అన్నారు. కనీసం మార్కెట్లో ప్రకటించిన జెండా పాట ప్రకారంగా నైనా రైతులందరి మిర్చి పంటను కొనుగోలు చేయక పోవడం దోపిడీకి నిదర్శనం అన్నారు. ప్రకటించిన జండా పాటకు అమలయ్యే ధరకు 8000 రూపాయల వరకు క్వింటాకు తేడా ఉంటుందన్నారు. మిర్చి రైతుకు ఎకరం పంట పండించడానికి 1 లక్ష 50 వేల రూపాయల వరకు పెట్టుబడి అవుతున్నదని దిగుబడి మాత్రం ఐదు నుంచి పది క్వింటాల పంట మాత్రమే వస్తున్నదని ఆ రకంగా చూస్తే రైతులు తీవ్రంగా నష్టపోతూ దోపిడి గురవుతూ అప్పుల పాలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో యదేచ్చగా మిర్చి రైతులు దోపిడి గురవుతున్న మార్కెట్ యంత్రాంగం ప్రభుత్వం చోద్యం చూస్తున్నది తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు.
అలాగే మిర్చి తాలుకాయకు ఎలాంటి జండా పాట లేకుండా తమ ఇష్టానుసారంగా వ్యాపారులు అతి తక్కువ ధర కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఇంతకంటే అన్యాయం మరొకటి లేదన్నారు. రైతాంగం ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెట్లోనే దోపిడీ చేయడం అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తక్షణమే మార్కెట్లో మిర్చి రైతులను దోపిడీ చేస్తున్న మధ్య దళారులు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకొని ప్రకటించిన జెండా పాఠాలు రైతులందరికీ అమలయ్యే విధంగా అలాగే మిర్చి తాలుకాయకు సైతం జెండా పాట పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కార్యదర్శి, ఉన్నత అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో మార్కెట్ను సందర్శించి మిర్చి రైతులను ఆదుకోవాలని అన్నారు. లేకపోతే రైతుల ఆందోళనలు ఉదృతం అవుతాయని హెచ్చరించారు.
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మిర్చి రైతుల గోడును అర్థం చేసుకొని క్వింటా మిర్చి కనీస మద్దతు ధర 25 వేల రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు ఐతం నాగేష్ పరిమళ గోవర్ధన్ రాజు శ్రీనివాస్ జక్కా అశోక్ అన్నెబోయిన ప్రేమలత రవి వీరన్న బాబు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.