భారత్ న్యూస్ వరంగల్ …మహిళా భవనాల నిర్మాణ పనుల పురోగతిని ప్రతిరోజూ నేనే పరిశీలిస్తా- మంత్రి సీతక్క

Ammiraju Udaya Shankar.sharma News Editor…రోజూ వీసీలతో పనుల సమీక్ష.. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు
ఉపాధి హామీ పనులు, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, నిజం న్యూస్, జూన్ 6:
గ్రామాల్లో నిర్మిస్తున్న మహిళా భవనాల నిర్మాణ పనుల పురోగతిని ప్రతి రోజూ తాను పరిశీలిస్తానని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. భవనాల నిర్మాణ పురోగతిపై రోజువారీగా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ఉపాధి హామీ పనులు, గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్ శాఖ అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసని అనసూయ సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క అక్కడి నుంచే శనివారం శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్, వివిధ జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 8 వేల గ్రామ మహిళా సమాఖ్య భవనాలకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.
ఈ భవనాలు కేవలం నిర్మాణాలు కాదని, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలిచే “ఆత్మగౌరవ భవనాలు” అని మంత్రి పేర్కొన్నారు. వాటి నిర్మాణ పనుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.
భవనాల నిర్మాణ పురోగతిపై నిరంతరం సమీక్ష నిర్వహించేందుకు రెగ్యులర్‌గా వీడియో కాన్ఫరెన్స్‌లు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి రోజు పనుల పురోగతిని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని, అవసరమైతే రోజువారీ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.

ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని మంత్రి స్పష్టం చేశారు. అందుకే తానే స్వయంగా సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తానన్నారు.
ప్రతి ఎంపీడీవో తమ మండలంలో ప్రోగ్రాం ఆఫీసర్‌గా వ్యవహరిస్తూ గ్రామాల్లో భవనాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు పనుల నాణ్యత, పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులపై కూడా ప్రత్యేక దృష్టి సారించి, లక్ష్యాలను సాధించేలా క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన అమలు జరగాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు….