భారత్ న్యూస్ గుంటూరు…తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు..
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో జనాలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్‌తో పాటు ఖమ్మం, మెదక్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజులు ఆయా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో జనాలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇక ఏపీలో రానున్న మూడు రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వడగాలుల తీవ్రత జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు దాదాపు 14 జిల్లాల్లో ఎండల ప్రభావం అధికంగా ఉండనుంది. ఇప్పటి వరకు కడప జిల్లా ఒంటిమిట్టలో 45°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 262 మండలాల్లో 40°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రతపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కీలక ప్రకటన చేశారు. గురువారం 101 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. ఎండల తీవ్రత పెరుగుతోందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు….