హైదరాబాద్ TO వైజాగ్‌.. ఈ హైవే ఎక్కితే జస్ట్ 8 గంటల్లోనే….!

భారత్ న్యూస్ విశాఖపట్నం..హైదరాబాద్ TO వైజాగ్‌.. ఈ హైవే ఎక్కితే జస్ట్ 8 గంటల్లోనే….!

ఆంధ్రప్రదేశ్ – తెలంగాణను కలుపుతూ కేంద్రం నిర్వహిస్తున్న నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ రహదారికి 365 BG అని నామకరణం చేశారు.

ఆగస్టు 15 నాటికి ఈ హైవేను ప్రారంభించాలని శరవేగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం – దేవరపల్లి మధ్య 162 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ రహదారి మిగిలిన వాటికంటే పూర్తి భిన్నమైనది. పచ్చటి పొలాల మధ్యలో నుంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య 125 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. మూడేళ్ల క్రితం ఖమ్మం నుంచి ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రహదారి నిర్మాణం చేపట్టారు. దేవరపల్లి – తల్లాడ జాతీయ రహదారి డైమండ్ జంక్షన్ఖ/ రెండు కిలోమీటర్ల దూరంలో గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది. 162 కిలోమీటర్ల దూరం ఉన్న నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే ను పచ్చటి పొలాల మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు.4609 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ రహదారి కోసం 31 గ్రామాల్లో 1996 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది.

ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిని హైదరాబాద్ – విశాఖపట్నం దూరం తగ్గించేందుకు ప్రధానంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే 676 కిలోమీటర్లు సుమారు 12 గంటల పాటు ప్రయాణించాలి. ప్రధానంగా విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కొత్త రహదారి పూర్తయితే విజయవాడ వెళ్లకుండానే సుమారు 125 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. 8 గంటల్లోనే విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. అలా నాలుగు గంటలు ఆదా అవుతుంది.