చంద్రగిరిలో ఘనంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమం
చంద్రగిరి (భారత్ న్యూస్) ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్‌లో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో మాజీ బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గం సభ్యురాలు మేడసాని అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రముఖులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మేడసాని పురుషోత్తం నాయుడు, అలాగే జనసేన పార్టీ నాయకులు తపసి మురళీ రెడ్డి విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, విద్యార్థులతో కలిసి వారు కూడా యోగాసనాలు వేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు మేడసాని పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ… నేటి ఆధునిక కాలంలో ఒత్తిడిని జయించడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి యోగా ఎంతో అవసరమని చెప్పారు. ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని, దీనివల్ల ఏకాగ్రత పెరిగి చదువుల్లో రాణించవచ్చని ఆయన ఆకాంక్షించారు. భారతదేశ ప్రాచీన సంస్కృతి అయిన యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారని, ‘యోగాంధ్ర’ లాంటి కార్యక్రమాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా దీనిపై అవగాహన కల్పించడం అభినందనీయమని ఆయన కొనియాడారు.

మరో ముఖ్య అతిథి, జనసేన నేత మురళీ రెడ్డి మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌లకు అలవాటుపడి మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారని, నిత్యం యోగా సాధన చేయడం ద్వారా జ్ఞాపకశక్తితో పాటు ఏకాగ్రతను కూడా పెంపొందించుకోవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును కాంక్షిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, విద్యార్థులంతా యోగాను నిత్య జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని మురళీ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం పిల్లలకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు శంకర్ రెడ్డి, శివ జయప్రకాష్ రెడ్డి, వేణుగోపాల్, ఆది లక్ష్మీ, ఏంఈఓ లలిత కుమారి, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.