భారత్ న్యూస్ హైదరాబాద్ …హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి మరోసారి లేఖ రాశారు.
ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2 విస్తరణకు సంబంధించిన అంశాలు త్వరితగతిన పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని, 2026 జూన్ 16న రాసిన లేఖను ముఖ్యమంత్రి గారు తాజాగా రాసిన లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) నిధుల విడుదలకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారం, మెట్రో ఫేజ్-2 అమలు తదితర కీలక అంశాలను ఆ లేఖలో వివరించినట్లు పేర్కొన్నారు.
జూన్ 22, 23 తేదీలలో తాను న్యూఢిల్లీ పర్యటనలో ఉండనున్నట్లు శ్రీ కిషన్ రెడ్డి గారికి రాసిన లేఖలో తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరారు. మీతోపాటు శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ఈ అంశాలపై చర్చించాలని ముఖ్యమంత్రి గారు లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఉన్నదని తెలియజేస్తూ, పెండింగ్ అంశాలు సత్వరం పరిష్కారం కావాలని అభిలషించారు. శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారితో చర్చించి మెట్రోకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా వివరించి, ముందుకు వెళ్లే మార్గంపై నిర్మాణాత్మక చర్చ జరిపే అవకాశం ఉంటుందని తెలిపారు.

చర్చలకు అవసరమైన సంబంధిత ఒప్పందాలు, ఇతర పత్రాల ప్రతులను కూడా వెంట తీసుకువస్తానని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. సమావేశ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుని, సమావేశానికి సంబంధించిన వివరాలను వీలైనంత త్వరగా తెలియజేయాలని ఆ లేఖలో శ్రీ కిషన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు కోరారు.