ఎమ్మెల్సీల నియామకంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

భారత్ న్యూస్ హైదరాబాద్…ఎమ్మెల్సీల నియామకంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

🍥గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ ఎం.కోదండరామరెడ్డి(కోదండరాం), మహమ్మద్‌ అజారుద్దీన్‌ల నియామకం వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నియామకంపై ఏవైనా అభ్యంతరాలుంటే ప్రస్తుతం వివాదం పెండింగ్‌లో ఉన్న సుప్రీంకోర్టునే ఆశ్రయించాలని స్పష్టంచేసింది. గవర్నర్‌ కోటా కింద కోదండరాం, అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 26న జారీ చేసిన జీవో 71ను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ హైదర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నియామక ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుకు లోబడి ఉంటుందని చెప్పారని, ఉద్దేశపూర్వకంగా ఎస్‌ఎల్‌పీ నంబరు ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ప్రతివాదుల నియామకానికి సంబంధించి అక్కడ పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసి కావాలనే స్పష్టంగా జీవో ఇవ్వలేదన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. జీవో 71లో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్సీల నియామక కేసు తుది తీర్పునకు లోబడి ఉంటుందని పేర్కొన్నారన్నారు. అక్కడ పెండింగ్‌లో ఉన్న అంశంలో.. ఇక్కడ జోక్యం చేసుకునే అధికారం లేదని వ్యాఖ్యానించారు. ఈ నియామకంపై ఏవైనా అభ్యంతరాలుంటే సుప్రీంనే ఆశ్రయించాలని సూచిస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేశారు.