దేశంలోని వైద్య రంగంలో 50 శాతానికి పైగా సేవలు తెలంగాణ నుంచి

భారత్ న్యూస్ హైదరాబాద్…దేశంలోని వైద్య రంగంలో 50 శాతానికి పైగా సేవలు తెలంగాణ నుంచి అందించాలన్న లక్ష్యంగా రాష్ట్రంలోని ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభిలషించారు. అందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. వైద్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో హాస్పిటల్ (The Hospital of Gratitude) ను మంత్రి దామోదర రాజనర్సింహ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా అపోలో వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారితో పాటు యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి గారు అభినందించారు.

“మెడికల్ టూరిజం కోసం మొన్నటివరకు ఒక పాలసీ లేదు. తమ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది. వైద్య రంగం అభివృద్ధికి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నాం. మెడికల్ టూరిజం మరింతగా వృద్ధి చెందాలని పశ్చిమాసియా దేశాలతో నేరుగా విమాన సర్వీసుల కోసం ప్రధానమంత్రి గారిని, పౌర విమానయాన శాఖ మంత్రిని కోరాం” అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు.

“దేశంలో 50 శాతంపైగా వైద్య సౌకర్యాలు తెలంగాణ నుంచి అందాలన్న లక్ష్యంతో ఎలాంటి లోపాలు లేకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇక్కడ పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుంది” అని హామీ ఇచ్చారు.

“1967 లో ఇందిరాగాంధీ గారు ఇక్కడ ఐడీపీఎల్‌ను ఏర్పాటు చేయడంతో ఆ తర్వాత క్రమంలో హైదరాబాద్ ఫార్మా హబ్‌గా అవతరించింది. ఆరోజు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల ఫార్మా హబ్‌గా మారింది. ఇప్పుడు దేశం నుంచి ఎగుమతి అవుతున్న బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం హైదరాబాద్ నుంచి అవుతున్నాయి” అని గుర్తుచేశారు.

“46 ఏళ్ల కిందట చెన్నైలో 150 పడకలతో ప్రారంభమైన అపోలో హాస్పిటల్స్ తన ప్రయాణంలో 76 వ బ్రాంచ్‌ను ప్రారంభిస్తున్నారు. 2028 డిసెంబర్ లోపు 100వ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని కోరుకుంటున్నానని” ఈ సందర్భంగా అభిలషించారు.

“అపోలో హాస్పిటల్స్ దేశానికి ఒక రోల్ మాడల్‌గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో ఒక బ్రాండ్. అపోలో అనే మాట సహాయం ఆశిస్తున్న కోట్లాది మంది ప్రజలకు మనసుల్లో నిలిచింది. అపోలో హాస్పిటల్స్ ఆదర్శంగా నిలిచి సమాజంలో గొప్ప సేవలు అందిస్తున్నాయి.

మహిళా సాధికారతను ప్రతాపరెడ్డి గారి చేతల్లో చూపించారు. వారి కూతుళ్లను అపోలోకు నాలుగు స్తంభాలుగా విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా సమాజంలో బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దారు” అని అభినందించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సంగీతా రెడ్డి గారు, శోభనా కామినేని గారు, ఉపాసన కొణిదెల గారితో పాటు ఇతర యాజమాన్య ప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు.