భారత్ న్యూస్ రాజమండ్రి…టమాటా రైతుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే
కంకిపాడు, ఉయ్యూరు, పడమట రైతు బజార్లకు మోపిదేవి మండల టమాటా
మోపిదేవి:
టమాటా రైతుల సమస్యను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిష్కరించారు. మంగళవారం మోపిదేవి మండలం కోసూరువారిపాలెం గ్రామ సర్పంచ్ కోసూరు అనూష, గ్రామ ప్రముఖులు కోసూరు శివ నాగమల్లేశ్వరరావు అవనిగడ్డలో ఎమ్మెల్యేను కలిసి టమాటా రైతు సమస్యను వివరించారు. ప్రస్తుతం మోపిదేవి మండలం కోసూరువారిపాలెం, నాగాయతిప్ప, ఉత్తర చిరువోలులంక, బొబ్బర్లంక గ్రామాల్లో రోజుకు రెండు వేల బాక్సుల టమాటా ఉత్పత్తి అవుతున్నట్లు తెలిపారు. వీటిలో చల్లపల్లి, మచిలీపట్టణం రైతు బజార్ల డిమాండ్ 500 బాక్సులు మాత్రమేనని తెలిపారు. రాబోయే వారం రోజుల్లో ఈ నాలుగు గ్రామాల నుంచి వచ్చే టమాటా దిగుబడి ఐదు వేల బాక్సులకు పెరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో టమాటా రైతులు ఎదుర్కోబోయే సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లకు ఫోన్ చేసి, ఇక్కడి టమాటా స్థాకును కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని రైతు బజార్లలో విక్రయాలు జరిగేలా రైతులకు సహకరించాలని సూచించారు. వెంటనే అంగీకరించిన అధికారులు మోపిదేవి మండల టమాటా స్టాకును కృష్ణాజిల్లాలోని ఉయ్యూరు, కంకిపాడు రైతు బజార్లు, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పడమట రైతు బజారులో విక్రయించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. టమాటాకు మార్కెట్ సదుపాయం కల్పించే ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఉద్యానవన శాఖ అధికారి రమేష్ కు ఎమ్మెల్యే సూచించారు. టమాటా రైతుల సమస్యకు తక్షణ పరిష్కారం చూపిన ఎమ్మెల్యేకు సర్పంచ్ అనూష, శివనాగమల్లేశ్వరరావు ధన్యవాదములు తెలిపారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చొరవతో అధికారులు ఇచ్చిన అనుమతి మేరకు సాయంత్రం నుంచి పడమట రైతు బజారుకు టమాటా స్టాక్ తరలిస్తున్నట్లు ఉద్యానవన శాఖ అధికారి రమేష్ తెలిపారు.
