చింతలపూడి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పి. స్వప్న సస్పెన్షన్

భారత్ న్యూస్ రాజమండ్రి…చింతలపూడి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పి. స్వప్న సస్పెన్షన్

ఏలూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు

ఏలూరు

చింతలపూడిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహం (IWHC) హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హౌస్ కీపింగ్) శ్రీమతి పి. స్వప్నను తక్షణమే విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ ఏలూరు జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి వెట్రి సెల్వి. కె, ఐ.ఏ.ఎస్. ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.

నిబంధనల ఉల్లంఘన.. బాధ్యతారాహిత్యం

ఈ నెల 27వ తేదీ (శనివారం) రాత్రి 8:45 గంటల సమయంలో, సదరు వసతి గృహంలో 7వ తరగతి చదువుతున్న బుల్లా అక్షయ అనే విద్యార్థినిని, ఉన్నతాధికారుల (ASWO / DD) ముందస్తు అనుమతి లేకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ స్వప్న తన సొంత నిర్ణయంతో బయటకు పంపించివేశారు. రాత్రి వేళ అని కూడా చూడకుండా విద్యార్థిని పట్ల అత్యంత బాధ్యతారాహిత్యంగా, కఠినంగా ప్రవర్తించారు. హాస్టల్ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో రాత్రికి రాత్రే హాస్టల్‌కు చేరుకోగా, ఎటువంటి సమాధానం చెప్పకుండానే సదరు అధికారిణి ఆ చిన్నారిని తల్లిదండ్రులతో పంపించివేశారు.

మీడియా కథనాలతో కదలిక

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో, ప్రముఖ న్యూస్ ఛానళ్లలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్, విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు మరియు ప్రవర్తనా నియమావళి 1964ను ఉల్లంఘించినందుకు గాను ఏపీసీఎస్ (CCA) రూల్స్ 1991 లోని సబ్-రూల్ (1)(a) రూల్ 8 ప్రకారం పి. స్వప్నను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అదనపు బాధ్యతల అప్పగింత

ప్రస్తుతం ఖాళీ అయిన చింతలపూడి బాలికల వసతి గృహ హౌస్ కీపింగ్ పూర్తి అదనపు బాధ్యతలను (FAC) చింతలపూడి IWHC (A.O) హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి కె. సునీతకు తక్షణమే అప్పగించారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులను వెంటనే అమలు చేసి, నివేదిక సమర్పించాల్సిందిగా చింతలపూడి అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్‌ను కలెక్టర్ ఆదేశించారు.