భారత్ న్యూస్ కరీంనగర్ …..కార్ పూలింగ్” లో మనోళ్లు టాపండీ..!
ముంబై, పూణేలను వెనక్కి నెట్టిన చిత్తూరు మేధావులు!
మన చిత్తూరు జిల్లా వాసులకి లోకజ్ఞానం, దాంతో పాటు ‘రూపాయి’ విలువ ఎంత బాగా తెలుసో చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి సామీ? మొన్నటికి మొన్న బ్లాబ్లా కార్ అంట. లెక్కలు తేల్చింది. ఈ 2026 జనవరి నుంచి మే నెలల మధ్యలో ఇండియాలోనే అత్యంత రద్దీగా మారిన కార్ పూలింగ్ రూట్ ఏదో తెలుసా? మన “బెంగళూరు – చిత్తూరు” రూటేనంట!
అవును సామీ, మీరు విన్నది నిజమే! ముంబై సిటీ మహానుభావులను, పూణే ఐటీ బాబులను, ఢిల్లీ పక్కనున్న గ్రేటర్ నోయిడా (గౌతమ్ బుద్ధ నగర్) ఘనులను అందరినీ వెనక్కి నెట్టేసి.. ఏకంగా 2.21 లక్షల మంది మనోళ్లు కార్లు షేర్ చేసుకుని ప్రయాణాలు సాగించారంట.
అసలు మనోళ్ల ప్లాన్ ఏంటంటే:
బెంగళూరులో ఐటీ ఉద్యోగాలో, వ్యాపారాలో చేస్తూ వీకెండ్ రాగానే మన చిత్తూరు గుర్తొచ్చేస్తుంది. కార్లు వేసుకుని ఒంటరిగా బయల్దేరితే.. ఆ పెట్రోల్ బిల్లులు, టోల్ గేట్ చార్జీలు చూస్తే గుండె గుభేల్ అంటుంది. అందుకే మనోళ్లు బుర్ర ఉపయోగించారు. “నువ్వెందుకు ఒంటరిగా పోతావ్? నా కార్లో ఖాళీ ఉంది రా.. టోల్ ఫీజు సగం సగం వేసుకుందాం!” అంటూ రూట్ మ్యాప్ మార్చేశారు.

ఒక వైపు బెంగళూరు ట్రాఫిక్‌ను భరిస్తూనే.. ఇంకోవైపు కార్లలో కూర్చుని “రాజకీయాలు, సినిమా కబుర్లు, చిత్తూరు మాండలికంలో ముచ్చట్లు” చెప్పుకుంటూ.. జర్నీని జాలీగా మార్చేయడంలో మన తర్వాతే ఎవరైనా! పైగా, ఒంటరిగా వెళ్తే డ్రైవింగ్ బోర్ కొడుతుందని, నలుగురిని ఎక్కించుకుంటే పెట్రోల్ ఖర్చు మిగలడమే కాకుండా, కొత్త స్నేహితులు దొరుకుతారని మనోళ్లు కనిపెట్టిన ఈ “ఎకనామిక్ ఫార్ములా” చూసి ఇప్పుడు దేశమంతా ముక్కున వేలేసుకుంటోంది.
పూణే-థానే వాళ్ళు (1.96 లక్షలు), ముంబై-పూణే వాళ్ళు (1.31 లక్షలు) కార్లలో సైలెంట్‌గా వెళ్తుంటే.. మన బెంగళూరు-చిత్తూరు రూట్ వాళ్ళు మాత్రం కార్ పూలింగ్ యాప్‌లని షేక్ చేసేశారు.
ఖర్చు తగ్గించుకోవడంలోనే కాదు.. పర్యావరణాన్ని కాపాడటంలో కూడా (తెలియకుండానే) చిత్తూరు ప్రజలు దేశానికే ఆదర్శంగా నిలిచారు. కాబట్టి, ఇకపై ఎవరైనా మనల్ని చూసి “చిత్తూరోళ్లా?” అంటే.. గర్వంగా కాలర్ ఎగరేసి చెప్పండి: “అవును సామీ, ఇండియాలోనే అత్యంత స్మార్ట్ కార్ పూలర్స్ మేము!” అని చెప్పుకుంటున్నారు.
వీళ్లపాసుగాల వీరి అదృష్టం బెంగుళూరు – చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కూడా స్పీడ్ గా సిద్ధం అవుతోంది. చెన్నై – బెంగుళూరు బుల్లెట్ ట్రైన్ వయా చిత్తూరు అంటున్నారు. అవొస్తే గానీ స్మార్ట్ పూలర్స్ ను కొట్టే వారే లేరు.
అమరావతి, వైజాగ్ స్మార్ట్ పూలింగ్ సిటీలుగా ఎదగాలని కోరుకుందాం.