భారత్ న్యూస్ వరంగల్ …గద్వాల/పాలమూరు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జిల్లాలో సుడిగాలి పర్యటన కొనసాగిస్తున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు జోగులాంబ గద్వాల జిల్లా ధారూర్ మండలం గూడెందొడ్డి వద్ద జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న స్టేజీ-1 పంప్ హౌస్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పంప్ హౌస్ పనుల పురోగతిని, నీటి పంపింగ్ సామర్థ్యాన్ని నీటి పారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం.. పనులను త్వరితగతిన పూర్తి చేయడంపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
అంతకుముందు, ఉదయం నుండి ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి గారు తొలిగా మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా కోయిల్ సాగర్ ప్రాజెక్టు, భీమా మరియు కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణం, అలాగే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ సైట్ పరివాహక ప్రాంతాలను నిశితంగా ఏరియల్ సర్వే (వైమానిక వీక్షణం) చేశారు.

జూరాల ఏరియల్ సర్వే ముగించుకుని నేరుగా గూడెందొడ్డి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు జిల్లా మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారితో కలిసి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రగతిపై నీటి పారుదల శాఖ అధికారులు ప్రత్యేకంగా రూపొందించిన లఘు చిత్రాన్ని (షార్ట్ ఫిలిం) వీక్షించారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులు మరియు జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.