11 లక్షల సబ్‌స్క్రైబర్లున్న యూట్యూబర్‌కు షాక్.. గూఢచర్యం కేసులో అరెస్ట్!

భారత్ న్యూస్ ఢిల్లీ…..11 లక్షల సబ్‌స్క్రైబర్లున్న యూట్యూబర్‌కు షాక్.. గూఢచర్యం కేసులో అరెస్ట్!

పంజాబ్‌లో ప్రముఖ యూట్యూబర్ జస్బీర్ సింగ్ అరెస్ట్

జ్యోతి మల్హోత్రాతో సంబంధాలున్నట్లు వెల్లడి

జస్బీర్ ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాలపై ఆరా

సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ ఇప్పుడు గూఢచర్యం ఆరోపణలతో కటకటాల పాలయ్యాడు. పంజాబ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. యూట్యూబ్‌లో 11 లక్షల మంది (1.1 మిలియన్) సబ్‌స్క్రైబర్లు కలిగిన జస్బీర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై గూఢచర్యం ఆరోపణలు నమోదయ్యాయి.

పంజాబ్‌కు చెందిన జస్బీర్ సింగ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విశేష ప్రజాదరణ పొందాడు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తూ గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై పంజాబ్ పోలీసులు జస్బీర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రాతో జస్బీర్ సింగ్‌కు సంబంధాలున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. జస్బీర్ సింగ్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, ఎవరెవరితో సంబంధాలు కొనసాగిస్తున్నాడనే విషయాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న ఒక యూట్యూబర్ ఇలా గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ కావడం సోషల్ మీడియా వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. జస్బీర్ సింగ్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. విచారణ పూర్తయితే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.