ఇంటి నుంచే ప్రారంభమయ్యే ధర్మం – సమాజానికి శాశ్వత దిక్సూచి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
తిరుపతి( మీ రిపోర్టర్ హేమంత్ )
సత్యం, దయ, క్షమ – జీవన మార్గదర్శకాలు
నిత్య జీవితంలో ధర్మాచరణం ప్రతి ఒక్కరి కర్తవ్యం
84 లక్షల జీవరాశులలో గోవు పవిత్రమైనది
ప్రతి బిడ్డ పుట్టిన రోజును తల్లి పుట్టినరోజుగా భావించాలి
తల్లిని గౌరవించడం నేర్చుకోవాలి – అదే నిజమైన సంస్కారం
ధర్మాన్ని కాపాడితే దేవుడు మన వెంట ఉంటాడు
శ్రీవేంకటేశ్వరుడు కరుణామయుడు
– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
నిత్య జీవితంలో సత్యం, దయ, క్షమ వంటి సద్గుణాలను ఆచరించడం ద్వారా మనిషి జీవితం సార్థకమవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు.
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం నిర్వహించిన ధార్మికోపన్యాస కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా “నిత్య జీవితంలో ధర్మాచరణం” అనే అంశంపై ఉపన్యసించిన ఆయన, కాలానుగుణంగా ధర్మంలో మార్పులు వచ్చినా సత్యం ఎప్పటికీ నిలకడగా ఉంటుందని తెలిపారు.
సత్యం, అహింస, దయ, క్షమ, సహనం వంటి గుణాలు ధర్మానికి మూలాధారాలని, ఇవే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని చెప్పారు.
ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుని సాన్నిధ్యం తప్పక ఉంటుందని, శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడని వివరించారు.
ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో ధర్మాచరణకు పెద్దపీట వేయాలని, ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను స్మరించడం, పెద్దలను ఆదరించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం మన బాధ్యత అని చెప్పారు. సనాతన ధర్మంలో తల్లికి అత్యున్నత స్థానం ఉందని, తల్లిని ప్రేమగా చూసుకోవడం, సేవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని వివరించారు.
అలాగే గోసేవ సనాతన ధర్మానికి ప్రాణస్వరూపం అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ గోవులను సంరక్షించి సేవించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ధర్మాచరణలో ఓర్పు ముఖ్యమైన గుణమని, ఓర్పును మించిన ధర్మం లేదని చెప్పారు. శ్రీవేంకటేశ్వర స్వామివారు క్షమాగుణంతో భక్తులపై అపార కరుణ చూపుతున్నారని పేర్కొన్నారు.
ధర్మబద్ధమైన జీవన విధానం ద్వారా వ్యక్తిగత శాంతి, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ సత్యం, దయ, క్షమ వంటి విలువలను ఆచరిస్తూ జీవించడమే నిజమైన భగవద్భక్తి అని పిలుపునిచ్చారు.
చాగంటి వారి ఉపన్యాసాన్ని వినేందుకు విచ్చేసిన భక్తులతో మహతి కళాక్షేత్రం కిక్కిరిసిపోయింది. ఆయన అందించిన ఆధ్యాత్మిక సందేశాలు శ్రోతలను ఆలోచనలో ముంచెత్తి, భక్తి భావాన్ని పెంపొందించాయి.
సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాల సారాంశాన్ని ప్రజలకు సులభంగా అందిస్తూ విలువలను పెంపొందించాలని చెప్పారు.
టీటీడీ భక్తులకు నిరంతర సేవలు అందిస్తూ, ప్రతి రోజూ ఎందరో భక్తులకు అన్నప్రదాలు న్నట్లు తెలిపారు. “భక్తుల సేవే – భగవంతుడి సేవ” అనే భావంతో పనిచేస్తున్న టీటీడీ ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక ఉపశమనాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
అనంతరం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో ( వైద్యం, విద్య) డా.ఎ.శరత్, సివిఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ ఘనంగా సత్కరించింది స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, జేఈవో (విద్య, ఆరోగ్యం) డా. ఎ. శరత్, సీవీఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ, సిపిఆర్ఓ డాక్టర్ టి. రవి, డిపిపి అదనపు కార్యదర్శి శ్రీమతి కళ్యాణి, డిప్యూటీ ఈవోలు శ్రీ గోవింద రాజన్, శ్రీ ఆనందరాజు, పలువురు అధికారులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.