Amarnath Yatra 2026: అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ షురూ.. వీరు మాత్రమే అర్హులు !

భారత్ న్యూస్ శ్రీకాకుళం….Amarnath Yatra 2026: అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ షురూ.. వీరు మాత్రమే అర్హులు !

భారతదేశంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటైన అమర్‌నాథ్ యాత్ర 2026కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఈ ఏడాది జూలై 3వ తేదీన ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆగస్టు 28వ తేదీన ముగుస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 57 రోజుల పాటు యాత్ర సుదీర్ఘంగా సాగనుంది. మంచు శివలింగ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో సవాలుతో కూడిన ఈ యాత్రలో పాల్గొంటారు. భక్తులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 550కి పైగా బ్యాంక్ శాఖల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర బ్యాంకుల వద్ద ఈ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. అలాగే, శైన్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రతి భక్తుడికి ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరి. భక్తుల భద్రత కోసం ఆర్ఎఫ్‌ఐడీ ట్రాకింగ్ వ్యవస్థతో పాటుగా ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తున్నారు.

రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం

  • ముందుగా శ్రీ అమర్‌నాథ్ జీ శ్రైన్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి లేదా సమీపంలోని ఎంపిక చేసిన బ్యాంక్ శాఖకు వెళ్లాలి.
  • దరఖాస్తు ఫామ్ నింపి అందులో అడిగిన వ్యక్తిగత వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి.
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, సరైన గుర్తింపు కార్డు జత చేయాలి.
  • ఏప్రిల్ 8వ తేదీ తర్వాత గుర్తింపు పొందిన వైద్యుల నుంచి తీసుకున్న కచ్చితమైన ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని (CHC) సమర్పించాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తుదారులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ నింపి, పత్రాలను అప్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఆఫ్‌లైన్‌లో అయితే బ్యాంకులో నేరుగా ఫీజు చెల్లించి రశీదు పొందాలి.
  • దరఖాస్తు విజయవంతమైన తర్వాత భక్తులకు సిస్టమ్ జనరేటెడ్ యాత్రా పర్మిట్ జారీ అవుతుంది. అందులో యాత్ర తేదీ, ఎంచుకున్న మార్గం తదితర వివరాలు ఉంటాయి.

అర్హతలు, వసతుల వివరాలు

అమర్‌నాథ్ యాత్ర చాలా ఎత్తులో కష్టతరమైన వాతావరణంలో సాగుతుంది కాబట్టి కఠినమైన ఆరోగ్య నిబంధనలు అమలు చేస్తున్నారు. 13 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు మాత్రమే ఈ యాత్రకు అర్హులు. ఆరు వారాలకు పైబడిన గర్భిణీ స్త్రీలకు అనుమతి లేదు. భక్తుల ప్రయాణం కోసం పహల్గామ్, బల్తాల్ అనే రెండు ప్రధాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఎంచుకున్న మార్గం ఆధారంగా రోజువారీ కోటా ప్రకారం ముందు వచ్చిన వారికి ముందు అనే పద్ధతిలో బుకింగ్స్ కేటాయిస్తారు.

ప్రయాణ తేదీకి ఏడు రోజుల ముందు ఆయా స్లాట్స్ మూసుకుపోతాయి కాబట్టి భక్తులు త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడం మంచిది. ఈ ఏడాది బల్తాల్ మార్గంలో మెరుగైన విద్యుత్ దీపాలు, మంచి నడక మార్గాలతో పాటుగా గుర్రాలు, పల్లకీలు, పోర్టర్ల కోసం ముందస్తు బుకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. అనుకోని విపత్తులు ఎదురైతే కాపాడేందుకు ప్రత్యేక రెస్క్యూ బృందాలను కూడా సిద్ధం చేశారు.