భారత్ న్యూస్ రాజమండ్రి…Ammiraju Udaya Shankar.sharma News Editor….ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం – వచ్చే శ్రావణ మాసంలో పేదల గృహప్రవేశాలు
వచ్చే శ్రావణ మాసంలో పేదలకు 3 లక్షల ఇళ్లు అప్పగించనున్న ప్రభుత్వం – ఇప్పటికే సుమారుగా లక్ష మంది లబ్ధిదారులకు రూ.300 కోట్లు మంజూరు
వచ్చే శ్రావణ మాసంలో పేదలతో గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అప్పటిలోగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, పేదల ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించింది.
ఇసుకను ఉచితంగా అందుబాటులో ఉంచింది. లేఅవుట్లలో సమస్యలను కూడా పరిష్కరించింది. గత 13 నెలల్లో 2.30 లక్షల గృహనిర్మాణాలు పూర్తయ్యాయి. రూఫ్ స్థాయిలో 87,000 ఇళ్లు ఉన్నాయి. లింటెల్ స్థాయిలో 1.2 లక్షల ఇళ్లు ఉండగా, బేస్మెంట్ స్థాయిలో ఏమో 50,000 ఇళ్లు ఉన్నాయి. మిగతా వాటికి పునాదులు కూడా వేయలేదు. వాటిని కూడా పూర్తి చేయించడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు.
ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు : కేంద్ర ప్రభుత్వం పేదలకు గృహ నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల చొప్పున అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఉపాధి హామీ పథకం కింద మరో రూ.30 వేలు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 1000 చెల్లిస్తోంది. ఇదికాకుండా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ లబ్ధిదారులకు రూ.50 వేలు, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, ఆదివాసీ గిరిజనులకు రూ.లక్ష అదనపు సహాయం అందిస్తున్నారు.
ఇప్పటికే సుమారుగా లక్ష మంది లబ్ధిదారులకు రూ.300 కోట్ల వరకు మంజూరు చేసింది. వారిలో 50 వేల మంది ఇళ్ల నిర్మాణాన్ని పునఃప్రారంభించినట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయం అందించినప్పటికీ నిర్మాణం ఎందుకు చేపట్టలేదో మిగిలిన వారు క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు.
అందరికీ ఇళ్లు – నిబంధనలు ఇవే : అయితే ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ‘అందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున భూమిని అందించే అంశంపై ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అందరికీ ఇళ్లు అనే ప్రాతిపదికన కేటాయించిన ప్లాట్లకు రాష్ట్ర ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ జారీ చేస్తుందని ఉత్తర్వులో వెల్లడించారు. ఈ కన్వేయన్స్ డీడ్ 10 సంవత్సరాల వ్యవధితో ఫ్రీ హోల్డ్ హక్కులను అందిస్తుందని స్పష్టం చేశారు.
జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఉచిత ఇళ్ల పట్టా ఇచ్చేలా విధివిధానాలను రూపొందించారు.
ఇంటి పట్టా ఇచ్చిన రెండు సంవత్సరాలలోగా గృహ నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
దారిద్య్ర రేఖ(BPL) దిగువన ఉన్నకుటుంబాలకు మాత్రమే ఉచిత ఇంటి స్థలం కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు.
