శ్రీవారి హుండీ (కొప్పెర)

భారత్ న్యూస్ తిరుపతి…శ్రీవారి హుండీ (కొప్పెర)

ఈ హుండీ బంగారువాకిలికి ఉత్తర పార్శ్వంలో గల నాలుగు స్తంభాలు నడుమ ఏర్పాటు చెయ్యబడి వుంది.

శ్రీ స్వామివారి దర్శనం చేసికొని, విమాన ప్రదక్షిణం చేసి వచ్చిన భక్తులు తమ తమ మొక్కుబళ్లను, కానుకలను, నిలువుదో పిళ్లను, ఈ హుండీలో సమర్పించు కొంటారు.
బంగారు నగలు, వెండి పాత్రలు, ముడుపులు, నాణాలు, నోట్లు, వస్త్రాలు, కర్పూరం, బియ్యం కలకండ,.. ఇలా ఎన్నోరకాలైన వస్తువులను భక్తులు స్వామివారికి కానుకలుగా ఈ హుండీద్వారా సమర్పిస్తారు.

నిటారుగా పెద్ద సంచీ ఆకృతిలో ఏర్పాటుచేయబడిన తెల్లని ‘కాన్వాసు గుడ్డలో పెద్దగాళాన్ని దించి, పై గుడ్డను రోటివలె తాళ్లతో కట్టి వేలాడ దీస్తారు. ఈ ‘కాన్వాసు’ గుడ్డపై శ్రీవారి శంఖ చక్రాలు తిరునామాలు చిత్రింపబడివున్నాయి.
భక్తులు వేసే కానుకలు భద్రంగా సరాసరి గంగాళంలో పడేటట్లుగా ఏర్పాటు చేయబడిన ఈ బుర్కా గంగాళాన్ని “కొప్పెర” అని కూడా అంటారు. ఈ హుండీ గుడ్డపై గల తాళ్లపైన దేవస్థానం వారి సీళ్లు ఏడు, అలాగే జియ్యంగార్ల సీళ్లు ఆరు లక్కతో వేస్తారు. ఈ హుండీని ఏర్పాటు చేసినప్పుడు, పరకామణి నిమిత్తం విప్పేటప్పుడు అధికారులు ఈ సీళ్లు సరిగా వున్నదీ లేనిదీ తనిఖీ చేస్తారు. ఇందుకు సాక్ష్యంగా ఇద్దరు యాత్రికులు కూడ వుంటారు.
హుండీని రోజుకు రెండు మార్లు అనగా మధ్యాహ్నం రెండవ నైవేద్య కాలంలో 12 గంటల సమయంలోను, మళ్లీ రాత్రి ఏకాంత సేవా సమయంలోను విప్పదీస్తారు. మరీ యాత్రిక జనసమ్మర్దం విపరీతంగా ఉంటూ కానుకలు ఎక్కువైన సమయంలో హుండీని రోజుకు మూడు, నాలుగు మారులు కూడా తీయడం కూడా జరుగుతుంది.

హుండీని ఏర్పాటు చేసిన ఈ స్థలంలో జగద్గురువులయిన శ్రీ మచ్చంకర భగవత్పాదులవారు శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారని, అందువల్లే అపరిమితమైన సంపద అసంఖ్యాకంగా ద్రవ్యరాశి ఆకర్షింపబడి ఈ హుండీ లోనికి చేరుతున్నదని అనూచానంగా, పరంపరగా వినవస్తున్న గాథ అని పెద్దలమాట

ఇది సత్యమే. ఈ హుండీ క్రిందుగా శ్రీ చక్రమున్నట్లుగా ప్రత్యక్షంగా దర్శించిన తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు శ్రీ రామనాథ ఘనాపాటి గారు ఓ రచయితతో (1992లో) చెప్పారు. సుమారు 70 ఏండ్ల క్రితం తాను వేదవిద్యార్థిగా వున్నప్పుడు ఆలయ అధికారులు నేలను ఎత్తు పెంచడానికిగాని హుండీ వున్న స్థలాన్ని త్రవ్వి చూడగా శ్రీచక్ర యంత్రం స్పష్టంగా గోచరించినదని అన్నారు.
ఇందువల్లనే కాబోలు ఈ ఆలయంలో ఉత్సవాలు (కల్యాణోత్సవాలు వగైరా) నిర్వహించే స్థలాలను అటుఇటు మార్పు చేశారు కాని, ఈ హుండీని (కొప్పెరను) మాత్రం ఇక్కడి నుంచి కదల్చలేదు!

శ్రీ వేంకటేశ్వరస్వామివారి వక్షఃస్థలంలో శ్రీమహాలక్ష్మి నెలవై వున్నం దువల్లే ఈ క్షేత్రంలో అంతులేని సంపద సమకూరుతున్నదని ప్రాచీనకాలం నుండి వస్తున్న విశ్వాసం! శ్రీవారివక్షస్థలంలో నెలకొనివున్న శ్రీదేవిని స్థిరరూపిణి యైన లక్ష్మిగాను, హుండీ ద్వారా వచ్చే అపూర్వమైన సంపదల సమూహాన్ని చర రూపిణియైనలక్ష్మిగాను భక్తులు భావిస్తారు.