భారత్ న్యూస్ శ్రీకాకుళం….తెలుగుదేశం పార్టీ జోనల్ ఇంచార్జ్ రెడెప్పగారి శ్రీనివాసరెడ్డిని కలిసిన అవనిగడ్డ టీడీపీ నేతలు
తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘ చర్చ
సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన శ్రీనివాసరెడ్డి
మంగళగిరి (టీడీపీ కేంద్ర కార్యాలయం):తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన, నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు నూతనంగా నియమితులైన పార్టీ జోనల్ ఇంచార్జ్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ ప్రస్తుత పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ఉన్న తాజా రాజకీయ పరిణామాలపై నాయకులు ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గ పరిధిలోని పలు కీలక సమస్యలను జోనల్ ఇంచార్జ్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం నూతన జోనల్ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డికి నాయకులు పుష్పగుచ్ఛం అందించి, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి

ఈ సందర్భంగా జోనల్ ఇంచార్జ్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో 90 శాతం పదవులు కూటమి అభ్యర్థులు గెలుచుకోవాలని అన్నారు.పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చిన స్థానిక సమస్యలను, నియోజకవర్గ తాజా పరిస్థితులను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ మరియు పార్టీ పరంగా ఆయా సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించేందుకు తన వంతు పూర్తి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా నాయకులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు ,నియోజకవర్గ పరిధిలోని మండల పార్టీ అధ్యక్షులు నడకుదిటి జనార్ధనరావు,యాసం చిట్టిబాబు,బండే శ్రీనివాసరావు,మెండు లక్ష్మణరావు,మోర్ల రాంబాబు,జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,పీఏసీఎస్ అధ్యక్షులు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.