భారత్ న్యూస్ శ్రీకాకుళం….కాకినాడ పోర్టు వద్ద పీడీఎస్ బియ్యం అక్రమ ఎగుమతి బహిర్గతం
910 టన్నుల బాయిల్డ్ రైస్ సీజ్… రూ.3.54 కోట్ల విలువ
కాకినాడ యాంకరేజ్ పోర్టు పరిసరాల్లో పీడీఎస్ బియ్యం అక్రమ ఎగుమతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర పౌర సరఫరా కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో పౌర సరఫరా, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీ స్థాయిలో అవకతవకలు బయటపడ్డాయి.
పోర్టు సమీపంలో భార్జీలు, రైల్వే వ్యాగన్లలో నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించిన అధికారులు, చెక్‌పోస్ట్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. బాయిల్డ్ రైస్, రా రైస్, రా బ్రోకెన్స్ ఎగుమతి విధానంపై వివరాలు సేకరించారు. టెక్నికల్ సిబ్బంది నమోదు చేసిన రికార్డులను సమీక్షించి సూచనలు ఇచ్చారు.
తదుపరి మానస ఎంటర్ప్రైజెస్ గోదాం, స్వార్టెక్స్ ప్లాంట్లు, ఎన్డీఆర్ గోదాం, చిత్ర ఆగ్రో ఎగ్జిట్స్, కొవ్వూరి ఆనంద్ రెడ్డి నిర్వహిస్తున్న సార్టెక్స్ యూనిట్లలో తనిఖీలు చేపట్టారు. అక్కడ 10 లారీలలో బియ్యం నిల్వ ఉన్నట్లు గుర్తించారు.
శాంపిల్స్‌ను పరీక్షించగా బాయిల్డ్ రైస్‌లో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ ఉన్నట్లు తేలింది. సాధారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సరఫరా చేసే బియ్యంలోనే ఇవి ఉంటాయని అధికారులు తెలిపారు. మిల్లోనూ ఇదే రకం బియ్యం నిల్వ ఉన్నట్లు నిర్ధారించారు.
విచారణలో, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి, అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు బయటపడింది.
భారీగా సీజ్
ఈ చర్యల్లో భాగంగా మొత్తం 910 టన్నుల బాయిల్డ్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
10 లారీలలో 260 టన్నులు
ప్లాంట్‌లో 650 టన్నులు
మొత్తం విలువ సుమారు రూ.3.54 కోట్లు ఉండగా, ఇందులో లారీల బియ్యం విలువ రూ.1 కోటి వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
జిల్లా పౌర సరఫరా అధికారి రుద్రరాజు సత్యనారాయణ రాజు తెలిపిన వివరాల ప్రకారం, అనాలసిస్ రిపోర్టుల కోసం నమూనాలు పంపించారు.

పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి ఎగుమతి చేయడం నేరమని, బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.