సోషల్‌మీడియాపై కేంద్రం కఠిన చర్యలు!.. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులకు నేరుగా నోటీసులు?

భారత్ న్యూస్ శ్రీకాకుళం….సోషల్‌మీడియాపై కేంద్రం కఠిన చర్యలు!.. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులకు నేరుగా నోటీసులు?

దేశ భద్రత పేరుతో సోషల్‌మీడియా వేదికలపై నియంత్రణను మరింత కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా అభ్యంతరకరంగా భావించే పోస్టులు పెట్టిన యూజర్లకు ఇకపై నేరుగా నోటీసులు జారీ చేసేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ రూల్స్‌–2021లో సవరణలు చేయాలని కేంద్రం ముందుకు వచ్చింది.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సోషల్‌మీడియా వినియోగంపై మరింత పర్యవేక్షణ పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఎక్స్‌ (X), ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌మీడియా వేదికలపై ఎవరైనా పోస్టులు పెట్టినా లేదా ఇతరులు పంపిన పోస్టులను షేర్‌ చేసినా, వాటి కంటెంట్‌పై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ముఖ్యంగా దేశ భద్రత, సామాజిక శాంతి భంగం కలిగించేలా ఉన్న కంటెంట్‌ను కఠినంగా నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు ప్రతిపాదించబడ్డాయి.

ఇకపై సోషల్‌మీడియా యూజర్లు, కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా న్యూస్‌ పబ్లిషర్లుగా పరిగణించబడే అవకాశం ఉంది. అంటే, వారు ప్రచురించే సమాచారానికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అభ్యంతరకరమైన పోస్టులు లేదా తప్పుడు సమాచారం (ఫేక్ న్యూస్) పంచితే, నేరుగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఐటీ నిబంధనలు–2021లో సవరణలు ప్రతిపాదిస్తూ సోమవారం ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలపై ప్రజలు, నిపుణులు, సంస్థలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ ఏప్రిల్‌ 14 వరకు గడువు ఇచ్చింది. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే సోషల్‌మీడియా వినియోగంలో మరింత జాగ్రత్త అవసరం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరిచే సమయంలో చట్టపరమైన బాధ్యతలను గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.