భారత్ న్యూస్ ఢిల్లీ…..సోషల్‌మీడియాపై కేంద్రం కత్తి!.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఇక అంతే!
పోస్టు చేసే వారికి డైరెక్టుగా కేంద్ర ప్రభుత్వం నోటీసులు.పోస్టును షేర్ చేసిన వారికి కూడా తలనొప్పులు తప్పవు.దేశ భద్రత పేరిట కొత్త ప్రతిపాదనలు.ఐటీ రూల్స్ సవరణకు సిద్ధం
కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై మీ సోషల్‌మీడియా ఖాతాలో ఏదైనా వ్యతిరేక పోస్టు పెడుతున్నారా? లేదా మీ మిత్రుడు పంపించిన పోస్టును మరెవరికైనా షేర్ చేస్తున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్‌మీడియా వేదికల మీద ఇకపై ఏదైనా పోస్ట్ చేస్తే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీ నుంచి మీకు నోటీసులు రావొచ్చు. ఆన్లైన్ వేదికలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే యూజర్లను, కంటెంట్ క్రియేటర్లను, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను కూడా న్యూస్ పబ్లిషర్లుగానే ఇకపై కేంద్రం చూడబోతున్నది.

అభ్యంతరకరమైన పోస్టులు పెడితే, డైరెక్టుగా యూజర్లకే నోటీసులు పంపించనున్నది. ఈ మేరకు ఐటీ నిబంధనలు, 2021లో కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ సోమవారం ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. దీనిపై ఏప్రిల్ 14 నాటికి అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరింది.