మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్

భారత్ న్యూస్ డిజిటల్:మెదక్:

“మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రామాయంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి, గొల్లిపర్తి, రెడ్డి కాలనీ, ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా అదనపు ఎస్పీ శ్రీ మహేందర్ గారు విస్తృతంగా పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ పరిశీలన చేపట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయనున్న భద్రతా ఏర్పాట్లపై రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్ గారు, ఎస్ఐ బాలరాజ్ గారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ రోజున ఓటర్లు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే పోలింగ్ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని, అప్రమత్తతతో ఉండాలని ఆదేశించారు.

పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల పరిధిలో 100 మీటర్ల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రజలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ గారు సూచించారు. ఎలాంటి ప్రలోభాలు, గుంపులుగా చేరడం, అనుమానాస్పద కదలికలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.

అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని కూడా పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని, భద్రతా చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

రామాయంపేట్ లో ఏర్పాటు చేసిన ఎస్ఎస్ టీ చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. అక్కడ ఉన్న సిబ్బందికి అప్రమత్తంగా ఉంటూ తనిఖీ చేయాలని, ప్రజలకు సూచిస్తూ 50,000/- కంటే ఎక్కువ నగదు తరలించాలంటే తప్పనిసరిగా సరైన ఆధారాలు చూపించాలని, లేకపోతే నగదు సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ గారి వెంట రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్ఐ బాలరాజ్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.