మావోయిజం ఒక రాజ్యాంగేతర శక్తి. మావోయిస్టులు అప్రజాస్వామికులు

భారత్ న్యూస్ విజయవాడ…మావోయిజం ఒక రాజ్యాంగేతర శక్తి. మావోయిస్టులు అప్రజాస్వామికులు. కానీ ఒక రాజ్యాంగం, ప్రజలు,చట్టబద్ధ వ్యవస్థ,ప్రజాస్వామ్యం చేయాల్సిన పనులు కొన్ని వాళ్ళు చేసి చూపారు. అడవుల్లో ఉంటూ దశాబ్దాలుగా అడవులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అడవులను కార్పొరేట్ శక్తుల పరం కాకుండా అడవులను గుండెలకు హత్తుకున్నారు. ఆదివాసుల హక్కులకు తమ ప్రాణాలను అడ్డుపెట్టారు, సహజ వనరుల విధ్వంసానికి అడుగడుగునా అడ్డు తలిగారు. దేశం లోపల ముఖ్యం గా అడవి లోపల ప్రజల మానప్రాణాలకు రక్షణగా తామున్నామని బాసటగా నిలిచారు. అణిచివేతలకు, అన్యాయాలకు, అక్రమాలకు, ఎదురొడ్డి పోరాడారు. దశాబ్దాలుగా ఏకైక ధిక్కారస్వరంగా దేశం నలుదిక్కులా వినిపించారు. ఈ విప్లవ పంథా ప్రజల జీవన వికాసానికి ఒక అడుగు దూరంలో నిలిచిపోయింది. కాకపోతే ప్రజల హృదయాలను కొన్ని ఏళ్ల పాటు ఏకధాటిగా ఏలారు. అసలైన ప్రజాపాలన అడవి ప్రజలకు రుచి చూపారు.

ఇటు పోలీసులు, ప్రభుత్వ బలగాలు రాజ్యాంగాన్ని పరిరక్షించేవాళ్లు పైగా చట్టబద్ధంగా ఎంపిక ఐనవాళ్లు. వీళ్ళు చేసే పనులన్నీ చట్టబద్ధమా!? వీళ్ళు పౌరులకు రక్షణ కల్పిస్తున్నారా,పాలక వ్యవస్థలకు తొత్తులుగా పనిచేస్తున్నారా!!??

నిజానికి మన దేశ రక్షణ వ్యవస్థ అంతర్గత దేశద్రోహులను పెంచి పోషిస్తుంది వారికి కాపలాగా ఉంటుంది. ఒక అవినీతిపరుడికి, ఒక అక్రమార్గుడికి, ఒక భూకబ్జాదారుడికి, ఒక బ్యాంకు రుణం ఎగవేత దారుడికి వొంత పాడి, ఒక బడా రాజకీయ నాయకుడికి అండగా నిలిచి,వారి చెప్పు చేతుల్లో బతికే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజలకు ఏం చేస్తున్నది, ఎలాంటి సందేశం ఇస్తున్నది అన్నది అసలైన ప్రశ్న?

ఈ ప్రశ్నకు కొన్ని సమాధానాలు మావోయిస్టుల రూపంలో ప్రజలకు కనపడ్డాయి, వినపడ్డాయి. అందుకే రాజ్యాంగేతర శక్తులైన మావోయిస్టులు అంటే ప్రజలకు అభిమానం.

ఇప్పుడు ఎక్కడ ఏ నోట విన్న #Hidma పేరు మార్మోగుతుంది. వాస్తవానికి హిడ్మా చేసింది రవ్వంత. రవ్వంత కూడా కొండంతగా మనకు ఎందుకు కనిపిస్తుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఆ రవ్వంత చేసే వాళ్ళు కూడా లేరు. కొందరు హిడ్మా పెద్ద గా చదువు కోలేదు అని విమర్శిస్తున్నారు అయితే ఉన్నత విద్య అభ్యసించకపోయినా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ఉన్నత విలువలతో ఉన్నత వ్యక్తిత్వంతో తనను నమ్ముకున్న తన అడవి కోసం, అడవి ప్రజల కోసం ఆఖరి శ్వాస వరకు పోరాడాడు, ఇప్పుడు హిడ్మానే ఒక చరిత్ర అయిపోయాడు. బాగా చదువుకున్న మనం సమాజం నడి మధ్యలో బతుకుతూ ఏ మాత్రం ప్రజా సమస్యల మీద పోరాడుతున్నామో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. హిడ్మా పెద్దగా చదువుకోకపోయినా హిడ్మా గురించే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. భావితరాలు చదువుకోబోతున్నాయి. ఎందుకంటే అతనిది ఒక వీరోచిత పోరాటం. హిడ్మా ను వీరుడు అనడం కూడా తక్కువే ఎందుకంటే అడవి జనం అతన్ని దేవుడు అంటున్నారు.