ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళా నిందితుల అరెస్టు

ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళా నిందితుల అరెస్టు

  • రూ.3.5 లక్షల విలువైన 32 గ్రాముల డైమండ్ గోల్డ్ నెక్లెస్ స్వాధీనం.
  • ప్రత్యేక పోలీసు బృందం చాకచక్యంతో కేసు త్వరితగతిన ఛేదన.
  • నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలింపు.
  • ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాపై ప్రత్యేక నిఘా. పాకాల( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్.,గారి ఆదేశాల మేరకు పాకాల మండల పరిధిలో ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల బ్యాగులు, హ్యాండ్ బ్యాగుల నుండి బంగారు ఆభరణాలు అపహరిస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పాకాల పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తును పాకాల పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ టి. చిన్న గోవిందు గారి పర్యవేక్షణలో ఎస్‌ఐ శ్రీ తరుణ్, డబ్ల్యూఎస్‌ఐ శ్రీమతి నాగ మంజుల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం చేపట్టింది.

దర్యాప్తులో భాగంగా నిందితుల కదలికలను గుర్తించిన ప్రత్యేక బృందం 07-06-2026 తేదీన సాయంత్రం 6.00 గంటలకు శంఖంపల్లి ఫ్లైఓవర్ క్రింద ముగ్గురు మహిళా నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసింది. అరెస్టు చేయబడిన నిందితులు జి. దివ్య (31), బి. రాధిక (38), బి. మేరీ (33)గా గుర్తించబడ్డారు. వీరంతా చిత్తూరు జిల్లా పరిధికి చెందినవారని పోలీసులు తెలిపారు.

విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించడంతో, వారి వద్ద నుండి కేసుకు సంబంధించిన సుమారు 32 గ్రాముల బరువున్న డైమండ్ గోల్డ్ నెక్లెస్ చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణం విలువ సుమారు రూ.3.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

మహిళా ప్రయాణికులే లక్ష్యం ప్రాథమిక విచారణలో నిందితులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకొని, రద్దీని ఆసరాగా తీసుకుని వారి బ్యాగుల్లోని విలువైన బంగారు ఆభరణాలను అపహరిస్తూ వచ్చినట్లు వెల్లడైంది. కేసును అత్యంత త్వరితగతిన ఛేదించి, నిందితులను అరెస్టు చేయడంతో పాటు దొంగిలించిన ఆభరణాన్ని రికవరీ చేసిన ఎస్‌ఐ శ్రీ తరుణ్, డబ్ల్యూఎస్‌ఐ శ్రీమతి నాగ మంజుల మరియు ప్రత్యేక పోలీసు బృందాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్.,గారు అభినందించారు.