భారత్ న్యూస్ విజయవాడ…నగరంలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ పర్యవేక్షణ..
క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం: మే 26, 2026:
నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడం, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మంగళవారం ఉదయం నగరంలో విస్తృతంగా పర్యటించారు.
ఉదయం 7 గంటలకు కలెక్టర్ స్వయంగా సైకిల్‌పై నగర వీధుల్లో పర్యటించి, పారిశుద్ధ్య పనుల తీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చిలకలపూడి సమీపంలోని ఎఫ్.సి.ఐ గిడ్డంగుల ప్రాంతంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి, స్థానికులతో మాట్లాడారు. నగర సుందరీకరణలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రతకు అందరూ సహకరించాలని ఆయన కోరారు.
అనంతరం లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనుక ప్రాంతంలో పారిశుద్ధ్య పరిస్థితులను కలెక్టర్ పరిశీలించారు. చెత్త తొలగింపుకు మునుపు, చెత్త తొలగించి శుభ్రత తర్వాత తప్పనిసరిగా ఫోటోలు తీసి రికార్డు చేయాలని నగర మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
రైతు బజార్ వద్ద ప్రధాన రహదారి వెంబడి పేరుకుపోయిన చెత్తను, డ్రైనేజీ పరిస్థితులను ఆయన నిశితంగా పరిశీలించారు. చెత్త తొలగించిన ప్రతి ప్రాంతాన్ని తిరిగి చెత్త వేయని విధంగా సుందరంగా తీర్చిదిద్దాలి అని, అక్కడ ప్రజలు కూర్చునేందుకు వీలుగా బల్లలను ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతరం సమస్యగా ఉన్న చెత్త పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిబంధనలు అతిక్రమించి చెత్త వేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో పారిశుద్ధ్య నిర్వహణ విభాగం కార్యదర్శులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
……………………….
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణా, మచిలీపట్నం వారిచే జారీ చేయబడింది.