సీఐ ఉద్యోగానికి రాజీనామా చేశాడు… ఖాకీ డ్రెస్ వద్దు అనుకున్నాడు.. కాషాయం వస్త్రాలు ధరించి సన్యాసిగా మారాడు..

భారత్ న్యూస్ విజయవాడ…సీఐ ఉద్యోగానికి రాజీనామా చేశాడు… ఖాకీ డ్రెస్ వద్దు అనుకున్నాడు.. కాషాయం వస్త్రాలు ధరించి సన్యాసిగా మారాడు..

పోలీసు ఉద్యోగం చేస్తూ అవినీతి, రాజకీయ వత్తిడులు సహించలేక రాజీనామా చేసి, కాషాయం ధరించి ధర్మ సేవలో ప్రవేశించిన విలక్షణ వ్యక్తి జయచంద్రరాజు. న్యాయం కోసం పేదల పక్షాన నిలబడి, అవినీతికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్న ఈయన కథ ఎవరినైనా ప్రభావితం చేస్తుంది.

పోలీసు వృత్తి చిన్ననాటి మక్కువ
నాగలాపురం మండలం రాజులకండ్రిగ గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన జయచంద్రరాజుకు చిన్నప్పటి నుంచి పోలీసు వృత్తిపై ఆకర్షణ ఎక్కువ. 1991లో తన లక్ష్యం సాధించి పాణ్యం మండలంలో ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఉయ్యాలవాడ, కర్నూలు జిల్లాల్లో పనిచేశారు. 2004లో సీఐగా పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్, రైల్వే, ఏసీబీ విభాగాల్లో సేవలందించారు.

అవినీతి వత్తిడులకు వ్యతిరేకంగా రాజీనామా
ఎక్కడ పనిచేసినా కొందరు నేతలు, ఉన్నతాధికారుల అన్యాయపు వత్తిడులు తన విధి నిర్వహణకు అడ్డుపడ్డాయి. బాధితులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాననే ఆవేదనతో మానసిక సంఘర్షణకు గురయ్యారు. చివరకు 2010లో సీఐ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

భగవద్గీత స్ఫూర్తితో ఆధ్యాత్మిక జీవనం
భగవద్గీతను తన మార్గదర్శకంగా భావించిన జయచంద్రరాజు స్వగ్రామంలోని తన పొలంలో శ్రీకృష్ణ సేవాశ్రమం నిర్మించారు. తన పొలంలో కొంత భాగం అమ్మి రూ.10 లక్షలు మూలధనంగా చేసి, గ్రామస్థులు, ఇంజినీరింగ్ విద్యార్థుల విరాళాలతో రూ.70 లక్షల వ్యయంతో శ్రీకృష్ణ భజన మందిరాన్ని నిర్మించారు. నిత్య పూజలు, భజనలతో ఆధ్యాత్మిక జీవనం సాగిస్తున్నారు.

గ్రామాన్ని మద్యం-మాంసాహారాలకు దూరం చేసిన ఆదర్శం
2011లో గ్రామస్థులతో కలిసి మద్యపానం, మాంసాహారాలపై తీర్మానం చేశారు. దీంతో గ్రామంలో 90 శాతం మంది యువకులు, పెద్దలు వీటిని వదిలేసి సంసారాలను సవ్యంగా నడుపుతున్నారు. గ్రామంలో తరచూ జరిగే గొడవలు, విభేదాలు గణనీయంగా తగ్గాయి.

పేదలకు న్యాయ సహాయం.. అవినీతికి వ్యతిరేక పోరాటం
నాగలాపురం మండలం మరియు సమీప ప్రాంతాల్లో పేదలు, బాధితుల పక్షాన నిలబడుతున్న జయచంద్రరాజు ధర్మరక్షణ సమితి స్థాపించారు. ఇసుక, సారా అక్రమ రవాణా, రెవెన్యూ అవినీతి వంటి సమస్యలపై నిరాహార దీక్షలు, పాదయాత్రలు చేపట్టి పోరాడారు.

పేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో న్యాయవిద్య అభ్యసిస్తున్నారు. తాను స్థాపించిన ‘కన్సలేషన్ ఫోరం’ ద్వారా మధ్యవర్తిత్వం చేసి సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు.

ప్రస్తుతం 1000 కి.మీ. పాదయాత్ర
గతంలో బాసరకు 900 కి.మీ. పాదయాత్ర చేసిన జయచంద్రరాజు ప్రస్తుతం ధర్మరక్షణ కోసం రాజులకండ్రిగ నుంచి ఇచ్ఛాపురం వరకు సుమారు 1000 కి.మీ.ల పాదయాత్ర చేపట్టారు. భగవంతుని ప్రార్థనతో ధర్మం రక్షించాలని పిలుపునిస్తున్నారు.