భారత్ న్యూస్ హైదరాబాద్….గోదావరి పుష్కర ఏర్పాట్లపై సి.ఎస్ సమీక్ష
హైదాబాద్, ఏప్రిల్ 9 : రానున్న గోదావరి నదీ పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై నేడు సచివాలయంలో సమావేశం జరిగింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత రావు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ, నిజామాబాద్ కందకుర్తి నుండి బాసర, భద్రాచలం వరకు 8 జిల్లాల్లో గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఉందని, ఈ జిల్లాల్లో పుష్కర స్నానాలకై పెద్ద సంఖ్యలో ప్రజానీకం వచ్చే అవకాశం ఉన్నందున పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ పుష్కర ఏర్పాట్లపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగారు తగు సూచనలు చేశారని, వారి ఆదేశాలకు అనుగుణంగా పుష్కర ఏర్పాట్లపై తగు ప్రతిపాదనలను రూపొందించి, గోదావరి పుష్కరాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించాలని సూచించారు. పుష్కర ఏర్పాట్లపై చేపట్టాల్సిన పనులపై ఇప్పటికే నియమించిన ఈ.ఎన్.సి.లు, చీఫ్ ఇంజనీర్ల కమిటీ ప్రతిపాదిత పుష్కర పనులను పరిశీలించాలని సూచించారు.

స్పెషల్ కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ చే జారీ చేయనైనది.