భారత్ న్యూస్ వరంగల్…..జోగుళాంబ గద్వాల్ పోలీస్
➤ యువతకు గట్టి హెచ్చరిక – కుటుంబాల భవిష్యత్తు కాపాడుకోండి, అక్రమాలకు దూరంగా ఉండండి
➤ తక్షణ లాభాల ఆశలో భవిష్యత్తును పణంగా పెట్టొద్దు… బెట్టింగ్‌లో పాల్గొంటే కేసులు, జైలు శిక్ష ఖాయం – జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో యువతను దారి తప్పించే క్రికెట్ బెట్టింగ్స్పై జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్., గారు గట్టిగా హెచ్చరించారు. తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు యువకులు ఈ అక్రమ కార్యకలాపాల వైపు ఆకర్షితులవుతున్నారని, ఇది వారి జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నదని పేర్కొన్నారు. క్రికెట్ బెట్టింగ్స్ కారణంగా యువత ఆర్థికంగా దెబ్బతిని, అప్పుల బారిన పడి, తీవ్ర నిరాశకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యల వరకు దారితీసే ప్రమాదం ఉందని, కుటుంబాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయని స్పష్టం చేశారు.
క్రికెట్ బెట్టింగ్ పూర్తిగా చట్ట విరుద్ధమని, ఇందులో పాల్గొనే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని ఎస్పీ గారు స్పష్టం చేశారు. బెట్టింగ్ నిర్వహించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువత తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇలాంటి మోసపూరిత మార్గాలకు దూరంగా ఉండాలని సూచించారు. క్రికెట్‌ను కేవలం వినోదంగా మాత్రమే చూడాలని, దానిని అక్రమ సంపాదనకు ఉపయోగించకూడదని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారి రోజువారీ కార్యకలాపాలను గమనించాలని సూచించారు. మ్యాచ్‌ల సమయంలో అనుమానాస్పద మార్పులు కనిపిస్తే వెంటనే అప్రమత్తంగా ఉండాలని కోరారు. క్రికెట్ బెట్టింగ్, ప్లేయింగ్ కార్డ్స్, బెట్టింగ్ యాప్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారదాతల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

“జీవితాన్ని నిర్మించండి… బెట్టింగ్స్‌తో నాశనం చేసుకోకండి” అంటూ జిల్లా ఎస్పీ ప్రజలకు, ముఖ్యంగా యువతకు పిలుపునిచ్చారు.
….పి. ఆర్. ఓ.
జిల్లా పోలీస్ కార్యాలయం,
జోగుళాంబ గద్వాల్ జిల్లా….