Income Tax: నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం

భారత్ న్యూస్ విశాఖపట్నం..Income Tax: నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం

పలు నిబంధనల్లో మార్పులు

ఆరు దశాబ్దాల నాటి పాత ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో నేటి నుంచి (ఏప్రిల్‌ 1) కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమైన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం పన్ను నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ ఫైనాన్స్‌ చట్టం-2025ను నోటిఫై చేసింది. దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కొత్త చట్టం సిద్ధమయ్యింది. ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ) పెంపు, విదేశీ విహార ప్యాకేజీలు, విద్య-వైద్యం నిమిత్తం విదేశాలకు పంపే మొత్తంపై పన్ను తగ్గింపు.. ఇలా ఎన్నో కీలక నిబంధనలు బుధవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి.

సులభంగా.. సరళంగా

పన్ను విధానాన్ని మరింత సులభంగా అర్థమయ్యేలా మార్చడమే కొత్త చట్టం లక్ష్యం. దీనిలో అసెస్‌మెంట్‌ ఇయర్, ప్రీవియస్‌ ఇయర్‌ అనే వ్యత్యాసాలను తొలగించి, ఒకే ‘ట్యాక్స్‌ ఇయర్‌’ విధానాన్ని తీసుకొచ్చారు. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్‌ (ఇన్‌కంట్యాక్స్‌ రిటర్నులు) దాఖలు చేసినప్పటికీ, ఎలాంటి జరిమానా లేకుండా, టీడీఎస్‌ (మూలం వద్దే పన్ను) రిఫండ్‌ను క్లెయిం చేసుకునే వెసులుబాటు కల్పించారు.

2026 జులైలో (2025-26 ఆదాయానికి సంబంధించిన) దాఖలు చేసే ఐటీఆర్‌లు పాత చట్టం నిర్దేశించిన ఫారాల ప్రకారమే సమర్పించాల్సి ఉంటుంది.

2026 జూన్‌ నుంచి చెల్లించే ముందస్తు పన్ను (ట్యాక్స్‌ ఇయర్‌ 2026-27 కోసం) మాత్రం కొత్త చట్టం ప్రకారం చెల్లించాలి. ఈ మార్పుల నేపథ్యంలో పాత, కొత్త చట్టాలకు సంబంధించిన సేవలను ఐటీ శాఖ ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ పారదర్శకంగా అందిస్తుందని ఆదాయపు పన్ను విభాగం స్పష్టం చేసింది.

7 ఐటీఆర్‌ ఫారాలు జారీ..

2026-27 మదింపు సంవత్సరానికి ఆదాయపు పన్ను విభాగం మొత్తం 7 ఐటీఆర్‌ ఫారాలను నోటిఫై చేసింది. మార్చి 30న చిన్న, మధ్య తరహా పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్‌ 1-4 ఫారాలను జారీ చేయగా, మంగళవారం ఐటీఆర్‌ 2, 3, 5, 6, 7తో పాటు ఐటీఆర్‌- యూ (అప్‌డేటెడ్‌ రిటర్న్స్‌) ఫారాలనూ నోటిఫై చేసింది. ఆడిట్‌ అవసరం లేని వారికి ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు జులై 31 వరకు గడువు ఉంది.

ఐటీఆర్‌-1 (సహజ్‌), ఐటీఆర్‌-4(సుగమ్‌): వార్షికాదాయం రూ.50 లక్షల లోపు ఉండి, వేతనం, ఒక ఇంటిపై ఆదాయం పొందేవారు సహజ్‌ దాఖలు చేయాలి. వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే వారు సుగమ్‌ సమర్పించాలి.

వ్యాపార లాభాలు లేకుండా మూలధన లాభాలు పొందేవారు ఐటీఆర్‌-2, సొంత వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందేవారు ఐటీఆర్‌-3, సంస్థలు, ఎల్‌ఎల్‌పీలు ఐటీఆర్‌-5, కంపెనీలు ఐటీఆర్‌-6, ట్రస్టులు ఐటీఆర్‌-7 ఫారాలను ఉపయోగించాలి.

ఎస్‌టీటీ పెంపు..

స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ కారణంగా చిన్న మదుపర్లు తీవ్రంగా నష్టపోకుండా రక్షించేందుకు, ఈక్విటీ డెరివేటివ్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) విభాగంలో సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ)ను పెంచారు.

ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులపై ఎస్‌టీటీ 0.02% నుంచి 0.05 శాతానికి చేరింది.

◾ఆప్షన్స్‌ ప్రీమియంపై 0.1% నుంచి 0.15 శాతానికి, ఆప్షన్స్‌ ఎక్సర్‌సైజ్‌పై 0.125% నుంచి 0.15 శాతానికి మారింది. సెబీ అధ్యయనం ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో మదుపరులు ఏకంగా రూ.1.05 లక్షల కోట్ల నికర నష్టాలను చవిచూశారు. ఈ విభాగంలో మదుపరుల సంఖ్య 2024-25లో 1.06 కోట్లు ఉండగా, 2025-26 డిసెంబరుకు 75.43 లక్షలకు పడిపోయింది.

టీసీఎస్‌పై ఊరట

మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తూ, విదేశీ టూర్‌ ప్యాకేజీలపై మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్‌)ను 20% నుంచి 2 శాతానికి కుదించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ (లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీం) కింద వైద్య, విద్యా అవసరాల కోసం విదేశాలకు పంపే నిధులపై టీసీఎస్‌ను ప్రస్తుత 5% నుంచి 2 శాతానికి తగ్గించారు.

బైబ్యాక్‌ షేర్లపై..

ఏప్రిల్‌ 1 నుంచి కంపెనీల బైబ్యాక్‌ ఆఫర్లలో షేర్లను విక్రయించడం ద్వారా ఆర్జించే మూలధన లాభాలపై వ్యక్తులు లేదా కార్పొరేట్‌ వాటాదారులకు 12% సర్‌ఛార్జీ విధించనున్నారు. గతంలో రూ.50 లక్షల వరకు సర్‌ఛార్జీ ఉండేది కాదు. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ఆదాయం ఉంటే 10% సర్‌ఛార్జీ ఉండేది. ఈ కొత్త నిబంధనతో పన్ను చెల్లింపుదారులపై పన్ను భారం పెరగనుంది.