భారత్ న్యూస్ విశాఖపట్నం..దేశవ్యాప్తంగా కోటి మంది విద్యార్ధులకు ఆధార్ అప్‌డేట్ పూర్తి
దేశంలోని పాఠశాల విద్యార్థుల ఆధార్ డేటా అప్‌డేట్ ప్రక్రియలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా సుమారు 83,000 పాఠశాలల్లో చదువుతున్న కోటి మందికి పైగా విద్యార్థులకు ‘తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్స్’ (ఎంబీయూ) పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.
ఎందుకు ఈ అప్‌డేట్ తప్పనిసరి

సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేసే సమయంలో కేవలం ఫొటో, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను మాత్రమే సేకరిస్తారు. ఆ వయసులో పిల్లల వేలిముద్రలు, కనుపాప (ఐరిస్) గుర్తులు పూర్తిగా పరిపక్వం చెందవు కాబట్టి వాటిని తీసుకోరు. అయితే 5 ఏళ్లు, 15 ఏళ్లు దాటిన తర్వాత పిల్లలు తమ బయోమెట్రిక్ వివరాలను ఆధార్‌లో అప్‌డేట్ చేయడం అత్యవసరం. ఈ వివరాలు అప్‌డేట్ చేయకపోతే భవిష్యత్తులో నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి కూడా ఈ అప్‌డేట్ తప్పనిసరి.