ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖ,

భారత్ న్యూస్ హైదరాబాద్….గౌర‌వ‌నీయులు శ్రీ రేవంత్‌రెడ్డి గారు,
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ‌ర్యులు

విన‌మ్ర‌త‌తో న‌మ‌స్క‌రిస్తూ…

జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్టు కో-ఆప‌రేటివ్ జ‌ర్న‌లిస్ట్ హౌజింగ్ స‌భ్యుడిగా మీ దృష్టికి ఈ విష‌యాలు తీసుకుని వ‌స్తున్నాను. వాటిపై త‌గు విచార‌ణ జ‌రిపించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నాను.

1) మేము సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులం. రెండు ద‌శాబ్దాలకుపైగా వివిధ ప‌త్రిక‌లు, ఛాన‌ల్స్ లో ప‌లుహోదాల్లో ప‌నిచేసిన‌వార‌ము.ప‌నిచేస్తున్నవార‌ము. మా ప‌రిస్థితి “ఊప‌ర్ షెర్వాణి… అంద‌ర్ ప‌రెషానీ”. పైకి గంభీరంగా ఉంటాం…కానీ క‌డుపులో పుట్టెడు క‌ష్టాలు. మాది 18 ఏళ్ల అంతులేని క‌థ‌.

2) సెప్టెంబ‌ర్ 8, 2024 మా జీవితాల్లో అత్యంత సంతోష‌క‌ర‌మైన దినం. దీపావ‌ళి, ద‌స‌రా, బ‌క్రీద్‌, క్రిస్మ‌స్..పండ‌గ‌ల‌న్నీ ఒక్క రోజున వ‌చ్చిన అద్భుతమైన అనుభూతి. దానికి కార‌ణం ముఖ్య‌మంత్రివ‌ర్యులు అయిన మీరే. ర‌వీంద్ర‌భార‌తి వేదిక‌గా క‌నీవినీ రీతిలో ప్రోగ్రాం పెట్టి మ‌మ్మ‌ల్ని గుర్తించారు. మా చిర‌కాల స్వ‌ప్నాన్ని నిజం చేశారు. ఆ రోజు మాలో, మా కుటుంబ స‌భ్యుల ముఖాల్లో వెయ్యి వోల్టుల కాంతి. మా స్పంద‌న‌, మా ఆనందం ఏ రీతిన ఉందో దానికి మీరే సాక్ష్యం.

3) ఆ ఆనందం అంతలోనే ఆవిరి అవుతుంద‌ని మేము క‌ల‌లో కూడా ఊహించ‌లేం. కానీ వెరీ నెక్ట్ డే నుంచే కుట్ర‌లు మొద‌ల‌య్యాయి. 8న మీరు ప‌ట్టాలు అంద‌జేస్తే… 9న మా క‌మిటీ పెద్ద రిజైన్ లెట‌ర్ మా మోహాన కొట్టారు. అంటే మీ కార్య‌క్ర‌మానికి అది నిర‌స‌న‌గానా? లేదా ల్యాండ్ ఇవ్వడం అత‌నికి ఇష్టం లేదానా? ఈ ఒక్క ఉదాహ‌ర‌ణ చాలు.

4) సుప్రీంకోర్టు కేసులో ఏం జ‌రుగుతోంది అన్న‌ది స్వ‌యంగా చూస్తున్న‌క‌మిటీ పెద్ద‌ల‌కు తెలియంది కాదు. మెడ‌పై క‌త్తి లాగా రిజ‌ర్వ్ అయిన సుప్రీం తీర్పు వేలాడుతోంద‌ని, అది ఎప్పుడైనా వేటువేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. అయినా తీసుకోమ‌ని ఇచ్చిన ల్యాండ్‌ను కూడా హ్యాండోవ‌ర్ చేసుకోలేని ద‌ద్ద‌మ్మ‌ల‌మ‌య్యాం. రేపుమాపు అంటూ మూడు నెల‌ల విలువైన స‌మ‌యాన్ని ఉద్దేశ్య‌పూర్వ‌కంగా క‌మిటీ వేస్ట్ చేసింది. అనుకున్న‌ట్లుగానే న‌వంబ‌ర్ 25న మాపై సుప్రీం తీర్పు అనే పిడుగు ప‌డింది. ఇక్క‌డే క‌మిటీ మ‌రో కోణం ఏమిటో బ‌య‌ట‌ప‌డుతున్న‌ది.

5) ఇక జ‌ర్న‌లిస్టు హౌజింగ్ సోసైటీ విష‌యానికి వ‌స్తే మాకు దైవ‌స‌మానులైన మీలాగా చాలా మంది క‌రుణించి మాకు అనుకూలంగా తీర్పులు ఇచ్చారు. 2010 జ‌న‌వ‌రి 5న హైకోర్టు ధ‌ర్మాస‌నం… జీవోలు కొట్టివేస్తూ, ఇళ్లు లేని వాళ్లు అఫిడ‌విట్లు ఇచ్చి తీసుకోవ‌చ్చు అని తీర్పు ఇచ్చింది. గుప్పెండు మంది ప్ర‌యోజ‌నాల కోసం 9 వంద‌ల‌మంది స‌భ్యుల‌ను న‌ట్టేట ముంచుతూ ఎవ‌రికీ చెప్ప‌కుండా సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు.

6) ఇక 2017లో సుప్రీంకోర్టు జ‌స్టీస్ చ‌ల‌మేశ్వ‌ర్ ధ‌ర్మాస‌నం… మాకు స్థ‌లాలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశిస్తూ, వాటిని డెవ‌ల‌ప్‌మెంట్ చేసుకోవ‌డానికి అనుమ‌తించింది. ఆ తీర్పుతో నిజాంపేట్‌లో 32 ఎక‌రాల స్థ‌లాన్ని అప్ప‌టి ప్ర‌భుత్వం సోసైటీకి హ్యాండోవ‌ర్ చేసింది. అప్ప‌టినుంచి అక్క‌డ డెవ‌ల‌ప్‌మెంట్ కాదుక‌దా, చిన్న‌బండ‌ను కూడా క‌మిటీ తొల‌గించ‌లేక‌పోయింది. ఇదంతా ఉద్దేశ్య‌పూర్వ‌కంగానే.

7) 2022 అగ‌స్టు 25. సుప్రీంకోర్టు అప్ప‌టి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టీస్ ఎన్వీ ర‌మ‌ణ త‌న రిటైర్ మెంట్‌కు ఒక‌రోజు ముందు మాకు అనుకూలంగా అమూల్య‌మైన ఆదేశాలు ఇచ్చారు. జెఎన్‌జే స్థ‌లాల్లో ఇండ్ల నిర్మాణాల‌కు అనుమ‌తి ఇచ్చారు. ఈ విదంగానైనా మేము సేఫ్ అవుతామ‌న్న‌ది గౌర‌వ‌నీయులైన జ‌స్టీస్ ఎన్వీ ర‌మ‌ణ ఉద్దేశ్యం కాబోలు. దాన్ని మూడేళ్లుగా నాన్చుతూ వ‌చ్చారు. డెవ‌ల‌ప్‌మెంట్ కోసం స‌భ్యుల‌ నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసి ఏలాంటి యాక్టివిటీస్ చేప‌ట్ట‌లేదు.

8) మ‌రోవైపు పేట్ బ‌షీరాబాద్ స్థ‌లంలో రోజు రోజుకు ఆక్ర‌మ‌ణ‌లు పెరుగుతున్నాయి. ఎక‌రంకు పైగా భూమి సెయింట్ ఆన్స్ స్కూల్ చేతిలో ఉంది. మ‌రో ఏడెనిమిది ఎక‌రాల్లో అక్ర‌మ నిర్మాణాలు వెలిశాయి. ఇటు నిజాంపేట్ లో కూడా ప‌లు ఆక్ర‌మ‌ణ‌లు ఉన్నాయి. మా స్థ‌లంలోకి దూసుకువ‌చ్చి జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ పేరిట నిర్మాణాలు వ‌చ్చాయి. క‌మిటీ ఉద్దేశ్య‌పూర్వ‌క తాత్సార్యంతో స‌భ్యులుగా తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాయి.

9) ఆయా స్థ‌లాల్లో ఎంత ఆక్ర‌మ‌ణ‌కుగురైంది. ఎవ‌రు దీనికి బాద్యులో క‌నిపెట్టి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నాము. హైడ్రాను రంగంలోకి దింపి ఆక్ర‌మ‌ణ‌లను కూల్చివేసి పేట్‌బ‌షీరాబాద్‌, నిజాంపేట్ స్థ‌లాల‌ను ప‌రిర‌క్షించాల‌ని కోరుతున్నాము.

సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా మీరే మా దైవ‌స‌మానులు. జ‌ర్నలిస్టుల స్థితిగ‌తులేమిటో మీకు తెలియ‌నిది కాదు. అందుకే అడ‌క్కుండానే మాకు పేట్ బ‌షీరాబాద్ ల్యాండ్ హ్యాండోవ‌ర్ మెమో ఇచ్చారు. జ‌ర్న‌లిస్టుల ముసుగులో ఎర్న‌లిస్టులుగా మారిన వారి భ‌ర‌తం ప‌ట్టాల‌ని విన‌మ్రంగా కోరుతున్నాము.

ముఖ్య‌మంత్రి వ‌ర్యుల‌కు మ‌రోసారి ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాను.

మారేప‌ల్లి ల‌క్ష్మణ్‌
JNJHS స‌భ్యుడు
Membership No:1040
Phone No: 9100133160