ఎస్‌వీయూలో నకిలీ చలాన్ల వ్యవహారం.. నత్తనడకన సాగుతున్న విచారణపై విమర్శలు
తిరుపతి: (భారత్ న్యూస్) ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వెలుగులోకి వచ్చిన నకిలీ బ్యాంకు చలాన్ల వ్యవహారం నెలరోజులు గడిచినా విచారణ ముందుకు సాగకపోవడంపై విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు, మేధావుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సమాచారం ప్రకారం, గత రెండేళ్లుగా విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో నకిలీ బ్యాంకు చలాన్లను ఉపయోగించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ మార్కుల మెమోలు, డిగ్రీ సర్టిఫికెట్లు, కాన్వొకేషన్ దరఖాస్తులు తదితర సేవల కోసం విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి, యూనివర్సిటీ ఖాతాలో జమ చేయకుండా నకిలీ చలాన్లను జతచేసి దరఖాస్తులు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం వల్ల విశ్వవిద్యాలయానికి రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లి ఉండవచ్చని ఉద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు చర్చించుకుంటున్నారు.
ఈ కేసులో శంకర్ అనే తాత్కాలిక ఉద్యోగి ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరీక్షల విభాగంలోని కొందరు అధికారులు, ఉద్యోగులతో కలిసి ఈ వ్యవహారాన్ని నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల కాన్వొకేషన్ దరఖాస్తుల సమయంలో పెద్దఎత్తున నకిలీ చలాన్లు సమర్పించడంతో అనుమానాలు వ్యక్తమై, విశ్వవిద్యాలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
పోలీసుల ప్రాథమిక విచారణలో పలువురు శాశ్వత ఉద్యోగులు, టైమ్‌స్కేల్ ఉద్యోగులు, ఎన్‌ఎంఆర్ ఉద్యోగుల పేర్లు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. శంకర్ ఇచ్చిన లిఖితపూర్వక వాంగ్మూలంలో పలువురి పేర్లను పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ధృవీకరణ మాత్రం వెలువడలేదు.
అంతేకాకుండా, రీవాల్యుయేషన్ విభాగంలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని రీవాల్యుయేషన్ ఫలితాలను ప్రభావితం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ చలాన్ల ద్వారా కూడా అక్రమంగా సొమ్ము చేసుకున్నారనే ప్రచారం విశ్వవిద్యాలయంలో జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ జరగలేదు.
కోట్ల రూపాయల అక్రమాలపై కేసు నమోదైనప్పటికీ, విచారణ నత్తనడకన సాగుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు లేకపోవడం, పోలీసుల దర్యాప్తులో జాప్యం చోటుచేసుకోవడంపై విద్యార్థి సంఘాలు, మేధావులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంలో నిజానిజాలను త్వరితగతిన వెలికితీసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సమగ్ర విచారణ నిర్వహించి, దోషులు ఎవరైనా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు, మేధావులు విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని, పోలీసు అధికారులను కోరుతున్నారు.