భారత్ న్యూస్ హైదరాబాద్…సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు నేరం కాదు:
తెలంగాణ హైకోర్టు తీర్పు!
ప్రజాస్వామ్యంలో పౌరుల గొంతుకకు పట్టం కడుతూ తెలంగాణ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రభుత్వంపై లేదా రాజకీయ నాయకులపై సోషల్ మీడియాలో విమర్శలు చేసినంత మాత్రాన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తూ ‘X’ (ట్విట్టర్)లో పోస్టులు పెట్టారన్న కారణంతో ఒక రాజకీయ కార్యకర్తపై పోలీసులు మూడు వేర్వేరు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ కేసులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్. తుకారాంజీ ధర్మాసనం ఆ కేసులను కొట్టివేస్తూ పోలీసులకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసే పనులను విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. అది రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19(1)(a) (భావప్రకటనా స్వేచ్ఛ) పరిధిలోకి వస్తుంది.

విమర్శనాత్మక పోస్టులు కనిపించగానే యాంత్రికంగా (Mechanically) కేసులు నమోదు చేయకూడదు. ఆ పోస్టులు కాస్త ఘాటుగా లేదా అసభ్యకరంగా ఉన్నంత మాత్రాన అవి క్రిమినల్ నేరాలు అయిపోవు.
గతంలో ‘శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్లుగానే.. కేవలం ఇబ్బందికరంగా ఉన్నాయన్న సాకుతో సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడం చెల్లదు.
ఈ తీర్పు ద్వారా స్పష్టమవుతున్నదేమిటంటే.. మీ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పవచ్చు. అయితే, ఆ విమర్శలు కేవలం అభిప్రాయ వ్యక్తీకరణకు పరిమితం కావాలి తప్ప, అవి ప్రత్యక్షంగా హింసను ప్రేరేపించేవిగా లేదా దేశ భద్రతకు ముప్పు కలిగించేవిగా ఉండకూడదు.
అధికారంలో ఉన్న వారు విమర్శలను స్వీకరించాలే తప్ప, చట్టాన్ని అడ్డుపెట్టుకొని గొంతు నొక్కే ప్రయత్నం చేయకూడదని హైకోర్టు తీర్పు మరోసారి గుర్తుచేసింది.👍✍️💐🙏.