భారత్ న్యూస్ రాజమండ్రి…నూనె బాటిల్లో ‘గ్రాముల’ మోసం — మూడేళ్లకు మేల్కొన్న కేంద్రం!
మనం కిరాణా కొట్టుకు వెళ్ళినప్పుడు పక్కపక్కనే ఉన్న రెండు నూనె బాటిళ్లలో ఒకటి చౌకగా కనిపిస్తే వెంటనే కొనేస్తాం. తీరా ఇంటికొచ్చాక చూస్తే… ఒకదాని బరువు 1 కిలో ఉంటే, చౌకగా వచ్చిన బాటిల్ బరువు కేవలం 810 గ్రాములే ఉంటుంది! అప్పుడు కానీ అర్థం కాదు మనం మోసపోయామని. కానీ ఇక్కడ తప్పు మీది కాదు, మనల్ని మోసపోయేలా ఒక లూప్‌హోల్ సృష్టించారు.
2023 జనవరిలో కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ ప్యాక్ సైజెస్’ (Standard Pack Sizes) నిబంధనను తొలగించింది. పరిశ్రమలకు వ్యాపార స్వేచ్ఛనిచ్చే పేరుతో తెచ్చిన ఈ మార్పు, అంతిమంగా వినియోగదారుడికి తీవ్ర గందరగోళాన్ని మిగిల్చింది.
దీనిని ఆసరాగా చేసుకుని, మార్కెట్లో ఒకే బ్రాండ్ నూనె ఏకంగా 19 రకాల సైజుల్లో దర్శనమిచ్చింది.
650 గ్రా, 700 గ్రా, 810 గ్రా, 850 గ్రా, 870 గ్రా… ఇలా స్వల్ప తేడాలతో ప్యాకెట్లను మార్కెట్లోకి వదిలారు.
ఇవన్నీ పైకి ఒకే పరిమాణంలో కనిపిస్తాయి. దాంతో ఏది లాభసాటిదో, దేని ధర ఎంతో పోల్చుకోవడం సామాన్య వినియోగదారుడికి అసాధ్యంగా మారింది. దీనినే కార్పొరేట్ పరిభాషలో ష్రింక్‌ఫ్లేషన్’ (Shrinkflation) అంటారు.
ఎట్టకేలకు మే 20న కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. దేశంలోని 90 శాతం వంటనూనె రంగాన్ని శాసించే పాన్-ఇండియా సంస్థలు ఇందులో పాల్గొన్నాయి.

మళ్లీ పాత పద్ధతిలోనే 200ml, 500ml, 1L, 5L, 15L, 20L లాంటి నిర్దిష్ట సైజులను మాత్రమే అనుమతించేలా లీగల్ మెట్రాలజీ’ (Legal Metrology) నిబంధనలను తిరిగి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.