రేవంత్‌ను టార్గెట్ చేసిన కేరళ కమ్యూనిస్టులు!

..భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్‌ను టార్గెట్ చేసిన కేరళ కమ్యూనిస్టులు!

కేరళ రాజకీయాల్లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు.. కేరళలో మాత్రం బద్ధ శత్రువులుగా తలపడుతున్నారు. అక్కడ త్వరలో ఎన్నికలు ఉండటంతో అధికార ఎల్‌డీఎఫ్ , ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ఎక్కడా చిన్న అవకాశం దొరికినా వదలడం లేదు. తాజాగా తెలంగాణలోని ఖమ్మంలో జరిగిన ఇళ్ల కూల్చివేతల ఉదంతం కేరళ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల విలేజ్‌లోని వినోబా నగర్‌లో ఇటీవల భూదాన్ భూముల్లో నిర్మించుకున్న సుమారు 700 ఇళ్లను తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. ఈ అంశాన్ని పినరయి విజయన్ తన ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ఇది కాంగ్రెస్ మార్క్ బుల్డోజర్ రాజ్ అంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తరాదిలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే కూల్చివేతలకు, తెలంగాణలోని కాంగ్రెస్ చర్యలకు తేడా లేదని, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి నకలు గా మారుతోందని ఆయన ఆరోపించారు. ఒకవైపు కేరళలో ప్రగతిశీల విలువల గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు, తెలంగాణలో పేదల ఇళ్లను ఎలా కూలుస్తారని ఆయన ప్రశ్నించారు.

ఈ విమర్శలు కేరళలోని కాంగ్రెస్ నేతలకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం కేరళ పత్రికల్లో ఇచ్చే భారీ ప్రకటనలను కూడా విజయన్ ఎత్తిచూపుతూ, ఆ ప్రకటనల మాటున ఇక్కడి కాంగ్రెస్ నేతలు తెలంగాణలోని అరాచకాలను దాస్తున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలోని యెలహంకలో జరిగిన కూల్చివేతలను కూడా ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేదల పరిస్థితి దారుణంగా ఉందనే సంకేతాలను ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీంతో పొరుగు రాష్ట్రాల్లో తమ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు ఇక్కడ సమాధానం చెప్పుకోలేక కేరళ కాంగ్రెస్ నేతలు సతమతమవుతున్నారు.