భారత్ న్యూస్ రాజమండ్రి…పేటలో రూ. 45.30 లక్షల నగదు సీజ్: ఐటీ శాఖకు అప్పగింత
చిలకలూరిపేట రూరల్:పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి మంగళవారం 19.05.2026 రాత్రి మండల పరిధిలోని తాతపూడి జాతీయ రహదారిపై ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా విజయవాడ నుండి చెన్నై వెళ్తున్న ఐరా ట్రావెల్స్ బస్సును సోదా చేయగా, భారీగా నగదు పట్టుబడింది.బస్సులో ప్రయాణిస్తున్న నరసరావుపేటకు చెందిన షేక్ మొహమ్మద్ హనీఫ్ వద్ద ఎలాంటి ఆధారాలు లేని రూ. 45,30,000/- (నలభై ఐదు లక్షల ముప్పై వేల రూపాయల) నగదును పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తిని విచారించగా, ఈ డబ్బుతో బంగారం కొనడానికి చెన్నై వెళ్తున్నట్లు తెలిపాడు. అయితే, ఈ నగదుకు సంబంధించి అతని వద్ద ఎటువంటి సరైన రశీదులు కానీ, పత్రాలు కానీ లేకపోవడంతో పోలీసులు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నగదును తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని ఆదాయపు పన్ను (ఇన్కమ్ టాక్స్) శాఖ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎవరైనా చట్టవిరుద్ధంగా, అక్రమంగా నగదు తరలిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ప్రజలను కోరారు.
