మహిళా సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.304 కోట్లు విడుదల..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….Telangana: మహిళా సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.304 కోట్లు విడుదల..

తెలంగాణలో గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.

304 కోట్ల వడ్డీ లేని రుణాలను విడుదల చేసింది. ఈ నిధులను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,57,098 గ్రామీణ మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేశారు. నిధుల విడుదలకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఏడాదికి రూ.25 వేల కోట్లు

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళా సంఘాలపై వడ్డీల భారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వమే ఆ వడ్డీలను క్రమం తప్పకుండా చెల్లిస్తోందని తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, ప్రతీయేటా రూ. 25 వేల కోట్లు తగ్గకుండా బ్యాంకు లింకేజీ రుణాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ ప్రజా ప్రభుత్వం మహిళల సాధికారత కోసం అనేక పథకాలను ప్రారంభించిందని, మహిళా సంఘాల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు.

గత ప్రభుత్వం కాజేసింది..

గత ప్రభుత్వం మహిళా సంఘాల విషయంలో నిర్లక్ష్యం వహించిందని మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించారు. “గత ప్రభుత్వం మహిళా సంఘాలకు దాదాపు రూ. 3,500 కోట్ల వడ్డీలను ఎగవేసింది. అంతేకాకుండా అక్కాచెల్లెమ్మల కష్టార్జితమైన అభయహస్తం నిధులను సైతం గత ప్రభుత్వం కాజేసింది. కానీ మా ప్రభుత్వం మహిళల చెల్లింపులను సకాలంలో అందిస్తూ, వారికి పూర్తి భరోసా కల్పిస్తోంది” అని సీతక్క అన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం

వడ్డీ లేని రుణాల విడుదల అనేది మహిళా సంఘాలు తమ వ్యాపారాలను, స్వయం ఉపాధి కార్యక్రమాలను మరింత విస్తరించుకోవడానికి దోహదపడుతుంది. ప్రభుత్వమే వడ్డీ భారాన్ని భరించడం వల్ల, మహిళా సంఘాలు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించడానికి ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా నిరంతరంగా పెద్ద మొత్తంలో క్రెడిట్ సదుపాయం పొందే వీలు కలుగుతుంది. ఈ తాజా నిధులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.