భారత్ న్యూస్ డిజిటల్:హైదరాబాద్:
అబిడ్స్ లోని TGSCO షాప్‌ను సందర్శించిన మంత్రి సీతక్క
పలు చీరలను కొనుగోలు చేసిన మంత్రి
- నేతన్నలను ప్రోత్సహించే విధంగా చేనేత చీరలు కొనుగోలు చేయాలి*
మేడారం జాతరలో స్టాల్ ను ఏర్పాటు చేయాలని సూచన

అబిడ్స్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ (TGSCO) షాప్‌ను మంత్రి సీతక్క సోమవారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మంత్రి సీతక్కకు స్వాగతం పలికి, షాప్‌లోని వివిధ విభాగాలను వివరించారు.
షాప్‌లో ప్రదర్శనకు ఉంచిన చేనేత కార్మికులు నేసిన చీరలను పరిశీలించిన మంత్రి సీతక్క, వాటి నాణ్యత, రంగులు, డిజైన్లపై ప్రశంసలు కురిపించారు. అనంతరం కొన్ని చేనేత చీరలను స్వయంగా కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, TGSCO షాప్‌కు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చేనేత కార్మికులు ఎంతో కష్టపడి, నైపుణ్యంతో, తరతరాలుగా వచ్చిన అనుభవాన్ని ఉపయోగించి అద్భుతమైన డిజైన్లతో చీరలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ లభిస్తున్న చీరలు సంప్రదాయానికి ప్రతీకగా ఉండటంతో పాటు, ఆధునిక మహిళలకు కూడా నచ్చే విధంగా ఉన్నాయన్నారు.
రాబోయే సమక్క-సారలమ్మ జాతరలో భక్తులకు అందుబాటులో ఉండేలా చేనేత చీరలను విక్రయించాలని, అందుకోసం అక్కడ ఒక చిన్న స్టాల్ ఏర్పాటు చేయాలని TGSCOను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆ ఉద్దేశంతోనే ఈ రోజు అబిడ్స్‌లోని TGSCO షాప్‌ను సందర్శించామన్నారు.
ఇక్కడి చీరలు తనకు ఎంతో నచ్చాయని, మంచి రంగులు, ఆకర్షణీయమైన డిజైన్లతో చేనేత వస్త్రాలకు నిజమైన గుర్తింపునిస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. చేనేత కార్మికుల ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా వారి శ్రమకు, కష్టానికి గౌరవం ఇచ్చిన వారమవుతామని చెప్పారు.
ప్రజలంతా TGSCO వంటి ప్రభుత్వ ధ్యేయంతో నిర్వహిస్తున్న చేనేత వస్త్రాలయాలను సందర్శించి, పండుగలు, శుభకార్యాల సందర్భంలో ఇక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.