ఎక్కువ సీట్లు గెలిచినా బీజేపీ ఆయనకే మద్దతు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఎక్కువ సీట్లు గెలిచినా బీజేపీ ఆయనకే మద్దతు.

కేంద్ర ప్రభుత్వంలో జేడీయూ ఎంపీల పాత్ర కీలకం మహిళలు, ఈబీసీ వర్గాల ఓటు బ్యాంకు ప్రధాన కారణం.

ఐదేళ్లూ పదవిలో కొనసాగడంపై రాజకీయ వర్గాల్లో చర్చ.

9 సార్లు ఎమ్మెల్సీగానే ముఖ్యమంత్రిగా రికార్డు

బిహార్ ముఖ్యమంత్రిగా మరోసారి నితీశ్ కుమార్ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. బీజేపీకి జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు ఉన్నప్పటికీ, ఎన్డీయే కూటమి ఆయన నాయకత్వానికే మొగ్గు చూపుతోంది. ఒకవేళ ఇదే జరిగితే, నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉందని ఎన్డీయే వర్గాలు చెబుతున్నాయి.

లోక్‌సభ ఎన్నికల్లో మహిళలు, దళితులు, అత్యంత వెనుకబడిన వర్గాల (ఈబీసీ) ఓట్లు ఎన్డీయే కూటమికి భారీగా పడటంలో నితీశ్ కీలక పాత్ర పోషించారు. దీనికి తోడు కేంద్రంలో బీజేపీ, టీడీపీ తర్వాత 12 మంది ఎంపీలతో జేడీయూ మూడో అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా ఉంది. ఈ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నితీశ్‌ను కాదని బీజేపీ ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఎల్జేపీ ఎంపీ శాంభవి చౌదరి, ‘హమ్’ నేత జితన్ రామ్ మాంఝీ వంటి మిత్రపక్ష నేతలు కూడా నితీశ్‌కే మద్దతు తెలుపుతున్నారు.

అయితే, నితీశ్ ఐదేళ్ల పూర్తికాలం సీఎంగా కొనసాగుతారా? అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. ఒకటి, రెండేళ్ల తర్వాత తమ అభ్యర్థిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని భావించవచ్చని అంచనాలున్నాయి. నితీశ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని కూడా ఒక కారణంగా చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నితీశ్‌కు ‘పల్టూ రామ్’ అనే విమర్శలు ఉన్నప్పటికీ, ‘సుశాసన్ బాబు’గా ప్రజల్లో ఆదరణ పొందారు. ఇప్పటివరకు 9 సార్లు సీఎంగా ప్రమాణం చేసిన ఆయన, ప్రతిసారీ శాసనమండలి సభ్యుడిగానే (ఎమ్మెల్సీ) ఆ పదవి చేపట్టడం విశేషం.