యుద్ధం కోసం డబ్బులు అడుక్కుంటున్న పాకిస్థాన్.. ఇక రెండు రోజుల్లో కాళ్లబేరం!

భారత్ తో ఉద్రిక్తతలు ఒక వైపు అయితే .. ఆర్థిక సమస్యలు మరోవైపు పాకిస్థాన్‌ను కొన్ని వారాలుగా టెన్షన్ పెట్టిస్తున్నాయి. పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థికంగా గట్టిగా ఇబ్బందుల్లో ఉంది. విదేశీ రిజర్వ్‌లు 8 బిలియన్ల డాలర్ల కంటే తక్కువగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం 20% దాటిపోయింది. రూపాయి విలువ బాగా పడిపోయింది. ఈ సమస్యలను తట్టుకోవడానికి పాకిస్థాన్ IMF నుంచి 7 బిలియన్ డాలర్ల లోన్ కోసం గట్టిగా ట్రై చేస్తోంది. అయితే భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ.. పాకిస్థాన్ కు అప్పులు పుట్టే పరిస్థితి కనిపించడం లేదు..? దీంతో ఏం చేయాలో అర్థం కాక బీద అరుపులో అరుస్తోంది..

పాకిస్తాన్ భారత దేశంలోని పౌర, సైనిక ప్రాంతాలపై దాడులు చేస్తోంది. కానీ ఈ దాడుల వల్ల భారత్ కంటే పాకిస్తాన్‌కే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దాడులు జరుగుతున్న సమయం చాలా కీలకం. పాకిస్తాన్ ఇప్పుడు ఇతర దేశాల నుంచి రుణాలు, సహాయంతో బతుకుతోంది. గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి -IMF పాకిస్తాన్‌కు 7 బిలియన్ డాలర్ల బెయిల్‌ఔట్ ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. అయితే ఈ బెయిల్‌ఔట్ ప్యాకేజీని పునఃపరిశీలించాలని IMFని భారత్ కోరింది. IMF లెక్కల ప్రకారం, 2025 మార్చి 31 నాటికి పాకిస్తాన్ రుణాలు 6.2 బిలియన్ డాలర్లు. 1950లో సభ్యదేశంగా చేరినప్పటి నుంచి పాకిస్తాన్ 25 సార్లు IMF నుంచి రుణాలు తీసుకుంది.

వరల్డ్ బ్యాంక్ లెక్క ప్రకారం, పాకిస్తాన్‌కు ఈ సంస్థ 48 బిలియన్ డాలర్లకు పైగా సహాయం చేసింది. పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసే స్థితిలో ఉంది. చైనా, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల నుంచి సహాయం, IMF, వరల్డ్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలతో బతుకుతోంది. 2024లో దాని విదేశీ రుణం 130 బిలియన్ డాలర్లకు చేరింది. జనవరిలో, వరల్డ్ బ్యాంక్‌తో పాకిస్తాన్ 10 సంవత్సరాల పాటు 20 బిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. 2010 నుంచి 2024 వరకు పాకిస్తాన్ విదేశీ రుణం భారీగా పెరిగింది. అయితే ఎన్ని అప్పులు తీసుకున్నా.. వాటిని తీర్చే పరిస్థితి లేదు. దీనికి IMF రుణం కోసం పాకిస్థాన్ ఎదురుచూస్తోంది. అయితే ఇలాంటి ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్ కు అప్పుపుట్టే మార్గం కనిపించడం లేదు.

పాకిస్తాన్‌లో సైన్యం ప్రజాస్వామ్యాన్ని అణచివేసింది. ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను తొలగించి, షెహబాజ్ షరీఫ్‌ను ప్రధానిగా నియమించాడు. మునీర్ సైన్యం నడిపే ఫౌజీ వాణిజ్య ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వ్యవస్థలోనూ పాత్ర పోషిస్తున్నాడు. అయితే దీని వల్ల స్వప్రయోజనం తప్ప.. దేశానికి లాభం లేకుండా పోయింది. దీనికి తోడు అప్పుల మీద అప్పుల చేయడంతో ఆర్థిక పరిస్థితి అదోగతి పాలైంది. పాకిస్తాన్ ఓ పక్క ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, తన దృష్టిని ఉగ్రవాదం మీదే కేంద్రీకరిస్తోంది. దీర్ఘకాల వాణిజ్య లోటు, తక్కువ పన్ను ఆదాయం, అధిక ప్రజా రుణం వల్ల దాని ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. వీటికి బడ్జెట్ లో కేటాయింపులు లేకుండా..

భారత్‌పై పగతో రక్షణ రంగానికి అధిక బడ్జెట్ కేటాయింపులు పెంచడం కూడా ఆర్థిక సమస్యను మరింత తీవ్రతరం చేసింది. ఓ పక్క పాకిస్తాన్ ప్రజలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, తక్కువ ఆర్థిక వృద్ధితో ఇబ్బందులు పడుతున్నారు. యువ నిపుణులు రికార్డు స్థాయిలో దేశం విడిచి వెళ్తున్నారు. పాలన సక్రమంగా లేకపోవడంతో పాకిస్థాన్ కు అప్పు ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఇలాంటి సయంలో ఐఎంఎఫ్ రుణం ఇవ్వడానికి ఓకే చెప్పింది. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కూడా డౌటే అంటున్నారు.

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో పాకిస్థాన్ దాడులు చేస్తోంది. ఈ దాడులు పాకిస్థాన్ కు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. భారత్‌పై సైనిక, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసి యుద్ధ వాతావరణం సృష్టించడం ద్వారా పాకిస్తాన్ తనపై తానే ఆత్మాహుతి దాడి చేసుకుందని అంటున్నారు. తాత్కాలికంగా రుణం దొరికినా.. పాకిస్థాన్ ధోరణి వల్ల భవిష్యత్తులో అప్పులు ఇచ్చే వారు తగ్గిపోవచ్చని అంటున్నారు. అటు వరల్డ్ బ్యాంకు సైతం పాకిస్థాన్ కు గట్టి షాక్ ఇచ్చింది. సింధు జలాల విషయంలో తామేమి చేయలేమని చేతులెత్తేసింది.

అటు వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు సంజయ్ బంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిశారు. భారత్ రద్దు చేసిన ఇండస్ వాటర్స్ ఒప్పందంలో తాము జోక్యం చేసుకోబోమని ఆయన చెప్పారు. 1961లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందాన్ని, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ రద్దు చేసింది. ఈ విషయాన్ని వరల్డ్ బ్యాంక్ దగ్గర తేల్చుకుంటామని పాకిస్థాన్ చెబుతుండగా.. వరల్డ్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. అయితే భారత్ తో ఉద్రిక్తతలతో రెండు రోజులకే పాకిస్థాన్ కకావికలం అయ్యింది. అప్పుల పాలయ్యామని అడుక్కునే పరిస్థితికి వచ్చేసింది.
కష్టాల్లో ఉన్నాం అంతర్జాతీయ ఆర్థిక భాగస్వాములు విరాళాలు ఇవ్వాలి అని పాకిస్తాన్ ఆర్థిక శాఖ సిగ్గు లేకుండా ట్విట్టర్ లో పోస్టు చేసుకుంది. ఇలాంటి సమయంలో యుద్ధం ఎందుకు అని ప్రశ్నించే సరికి పోస్ట్ డిలీట్ చేసుకుంది. ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయిందని కవర్ చేసుకుంది.

భారత్ చేసిన రెండు రోజుల దాడులకే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం అయిపోయింది. వందల కోట్ల సంపదను నాశనం అయిపోయింది. భారత్ పైకి పంపిన ఫైటర్ జెట్లు, డ్రోన్లు ఒక్కటి కూడా వెనక్కి పోలేదు. మరోవైపు ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ కు రోజువారీ వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. పైగా షేర్లు కుప్ప కూలిపోతుండటంతో .. స్టాక్ మార్కెట్లను మూసివేశారు. ఇప్పుడు అప్పుల కోసం ఆర్థిక సంస్థల వద్దకు పరుగులు పెడుతోంది.

ఇప్పుడు అప్పు ఇస్తే యుద్ధానికి వాడుతారని ఎవరూ అప్పులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఘర్షణలు మొదలైన రెండు రోజులకే పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోతుంది. ఆ దేశంలో ఇప్పటికే ఆర్థిక పరమైన ఎమర్జెన్సీ కనిపిస్తోంది. బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నారు. విత్ డ్రాకు లిమిట్ పెట్టారు. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోయింది. భారత ఆర్థిక యుద్ధాన్ని కాచుకోవడం పాక్ కు సాధ్యం కావడం లేదు.