భారతదేశం హై అలర్ట్‌లో ఉందా? అసలు ఏం జరగబోతుంది..

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ కవ్వింపు చర్యలు ఎక్కువయ్యాయి. LOC దగ్గర కాల్పులు జరపడంతో పాటు.. సరిహద్దులపై దాడులు చేస్తోంది. అయితే పాకిస్థాన్ దాడులను భారత్ గట్టిగా తిప్పికొడుతోంది. ఇటు ఈ ఉద్రిక్తతల ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రజల భద్రత కోసం కీలక చర్యలు తీసుకుంటోంది. నిత్యావసర వస్తువుల నిల్వలు సరిపడా ఉండేలా జాగ్రత్త పడుతోంది. సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ లు, డ్రోన్లపై నిషేధం, సైరన్ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇటు దేశంలో జాగ్రత్తలు తీసుకుంటునే అటు.. అంతర్జాతీయంగా పాక్ సహకరిస్తున్న దేశాలకు భారతీయులు వెళ్లకుండా జాగ్రత్త పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ చర్యలు ఎంత వరకు ఉపయోగపడతాయి..?

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పై పాకిస్థాన్ దాడులకు తెగబడుతోంది. జమ్ము,పంజాబ్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు, మిసైల్స్ తో అటాక్ చేస్తోంది. అయితే ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ముఖ్యంగా రాత్రి అయ్యే సరికి పాక్ .. భారత్ లోని సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లతో దాడులకు తెబడుతోంది. S400తో పాటు యాంటీ డ్రోన్, యాంటీ మిసైల్ టెక్నాలజీతో వాటిని భారత్ అడ్డుకుంటోంది. ఇటు భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం ప్రజల భద్రత కోసం గట్టి చర్యలు తీసుకుంటోంది. దేశంలో కూరగాయలు, పప్పుధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువుల కొరత రాకుండా తగినంత నిల్వలు అందుబాటులో ఉండేటా చేస్తోంది. వస్తువుల ధరలు నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అన్ని నగరాల్లో సరఫరా స్థిరంగా ఉంచేందుకు వ్యవస్థను ఏర్పాటు చేసింది. దేశంలో ప్రజలకు ఆహార నిల్వలపై భయం లేకుండా భరోసా కల్పిస్తోంది.

రాష్ట్రాల్లోని ఆహార కార్యదర్శులు, సరఫరా వాటాదారులతో కేంద్రం నిరంతరం సమావేశాలు నిర్వహిస్తోంది. అక్రమ నిల్వలు, ధరల పెంపును నివారించేందుకు వ్యాపారులు, సరఫరాదారులపై కఠిన నిఘా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. చండీగఢ్‌లో నిత్యావసర వస్తువుల నిల్వపై నిషేధం విధించారు. వ్యాపారులు తమ వద్ద ఉన్న నిల్వల సమాచారాన్ని మూడు రోజుల్లో ఆహార, సరఫరా శాఖకు తెలపాలని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను అక్రమంగా నిల్వ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలు భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ సన్నద్ధతను, విపత్తు సమయంలో ప్రజల జీవనాధారానికి తోడ్పడతాయి. అయితే పాకిస్థాన్ మాత్రం ఆర్థిక సంక్షోభం, అస్థిరతతో ఇలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోలేని ఆపసోపాల స్థితిలో ఉంది.

మరోవైపు పాకిస్థాన్ దాడులను రక్షణ కల్పించేందుకు సరిహద్దు ప్రాంతాల ప్రజలను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గుజరాత్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా డ్రోన్లపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష్‌ సంఘవి తాజాగా ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరూ దీనిని పాటించాలని కోరారు. రాష్ట్రంలో జరిగే ఏ వేడుకల్లోనైనా బాణసంచా, డ్రోన్లపై ఈ నెల 15 వరకు నిషేధం విధిస్తున్నామన్నారు.

దయచేసి ఈ మార్గదర్శకాలను పాటించాలని, ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం అని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో జరిగిన సమావేశం అనంతరం ఆయన ఈ పోస్ట్‌ పెట్టారు. మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్‌ పటిష్ఠమైన జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భద్రతా సన్నద్ధతపై ప్రధాని ఆరాతీసి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భద్రతాపరంగా సున్నిత ప్రాంతాలైన కచ్‌, బనస్కంతా, పటాన్‌, జామ్‌నగర్‌లో పౌరుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి అడిగారు.

ఏదైనా అత్యవసర పరిస్థితులను తలెత్తితే వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో రాత్రి బ్లాకౌంట్, స్కూళ్ల మూత, ఉద్యోగులకు సెలవులు రద్దు వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో బలగాలను మోహరించడం, కంట్రోల్‌ రూమ్‌లు, అనేక ప్రాంతాల్లో ఎయిర్‌ సైరన్ల ఏర్పాటు, మాక్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కీలక స్థావరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్‌, పార్కులు, మెట్రో స్టేషన్లలో నిఘాను పెంచారు. ఎటువంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా 11 జిల్లాలను సంసిద్ధం చేస్తున్నారు.

వీటితోపాటు నగర వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా సైరన్లను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రదేశాల్లో సైరన్లు ఏర్పాటు చేయనున్నారు. 11 జిల్లాల పరిధిలో ఇప్పటివరకు 10 సైరన్లు ఏర్పాటు చేశారు. కొన్ని సైరన్‌ శబ్దాలు రెండు కి.మీలు, కొన్ని నాలుగు, మరికొన్ని 16 కి.మీ పరిధి వరకు వినిపిస్తాయని అంటున్నారు. వీటికి సంబంధించి జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, ఇవి శబ్దం చేసినప్పుడు ఎలా స్పందించాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

ఇటు దేశంలోని రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు.. పాకిస్థాన్ కు సహకరిస్తున్న దేశాలు వెళ్లకుండా భారత్ ఆంక్షలు విస్తోంది. అంతర్జాతీయ ట్రావెల్‌ బుకింగ్‌ సేవలు అందించే పలు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పాక్‌కు మద్దతుగా నిలుస్తున్న తుర్కియే, అజర్‌బైజాన్‌ వంటి దేశాలకు కొత్త బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ దేశాలకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, అక్కడి సున్నితమైన ప్రాంతాల పర్యటన ప్రణాళికల విషయంలో అప్రమత్తతంగా వ్యవహరించాలని తెలిపాయి. తుర్కియే, అజర్‌బైజాన్‌, ఉజ్బెకిస్థాన్‌లకు నూతన బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపేయాలని నిర్ణయించినట్లు పర్యాటక సేవల బ్రాండ్‌ కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ వెల్లడించింది.

పహల్గాం దాడి, తదనంతరం పరిణామాల నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఈజ్‌మైట్రిప్‌ తెలిపింది. అత్యవసరమైతేనే తుర్కియే, అజర్‌బైజాన్‌లను సందర్శించాలని సూచించింది. ట్రిప్‌ ప్లానింగ్‌కు ముందు ట్రావెల్‌ అడ్వైజరీలను పరిగణనలోకి తీసుకోవాలని ఈజ్‌మైట్రిప్‌ వ్యవస్థాపకుడు నిశాంత్‌ ట్వీట్‌ చేశారు. అటు తుర్కియే, అజర్‌బైజాన్‌లకు అన్ని ప్రయాణ ప్యాకేజీలను నిలిపివేసినట్లు ట్రావోమింట్ తెలిపింది. ఈ దేశాలకు ఇప్పటికే చేసుకున్న బుకింగ్‌లపై క్యాన్సలేషన్‌ ఫీజు వసూలు చేయబోమని వెల్లడించింది. అయితే.. అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఫ్లైట్‌ బుకింగ్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పింది.