తెరుచుకున్న శబరిమల ఆలయం

భారత్ న్యూస్ అనంతపురం…తెరుచుకున్న శబరిమల ఆలయం

— 41రోజుల పాటు మండల పూజ

ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో తెరిచుకున్న శబరిమల ఆలయ తలుపులు

శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. మండల-మకరవిళక్కు సీజన్లో భాగంగా అయ్యప్ప ఆలయం ఆదివారం తెరుచుకుంది. సాయంత్రం 5 గంటలకు ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో ఆలయ తలుపులను తెరిచారు. ఈ క్రమంలో భక్తుల భద్రత, సౌకర్యాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సోమవారం నుంచి భక్తులకు అనుమతి..

ఆదివారం సాయంత్రం ప్రారంభ పూజను ఆలయ ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి నిర్వహించారు. ఆచారబద్ధంగా పూజ ప్రారంభమైన తర్వాత శ్రీకోవిల్ (గర్భగుడి) నుంచి తీసుకువచ్చిన జ్వాలను ఉపయోగించి పవిత్రమైన 18 మెట్లు వద్ద అధి (పవిత్ర మంట)ను వెలిగిస్తారు. సుమారు 6.30 గంటలకు ప్రధాన పూజారి ఆలయంలో అభిషేక కార్యక్రమం జరిగింది. ఆదివారమే ఆలయాన్ని తెరిచినప్పటికీ వృశ్చిక మాసాన్ని పురస్కరించుకుని సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు అధికారిక ఆచారాలు, కొత్త పూజారులు తలుపులు తెరవడంతో తీర్థయాత్ర సీజన్ మొదలవుతుంది. ఆ రోజు నుంచి భక్తులను అయ్యప్ప దర్శనం కోసం అనుమతిస్తారు.

41రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసేస్తారు. మళ్లీ డిసెంబర్ 30న మకరవిలక్కు కోసం ఆలయాన్ని తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అదే నెల 20న ఆలయాన్ని మూసివేస్తారు.