హైదరాబాద్: బ్లడ్ ప్లాస్మా వాహనంలో మద్యం సీజ్

భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్: బ్లడ్ ప్లాస్మా వాహనంలో మద్యం సీజ్

ప్రమాద స్థితిలో రోగులకు అత్యవసరంగా బ్లడ్ ప్లాస్మా సరఫరా చేసే వాహనంలో ఖరీదైన మద్యం అక్రమంగా రవాణా చేస్తూ ఇద్దరిని ఎస్‌టీఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న 24 గ్లెన్‌లివేట్ మద్యం బాటిళ్ల విలువ సుమారు ₹1.70 లక్షలు అని అంచనా వేశారు.

చింతల జైపాల్ రెడ్డి ఢిల్లీ–హైదరాబాద్ మధ్య బ్లడ్ ప్లాస్మా వాహనం నడుపుతుండేవాడు. ఢిల్లీలో తక్కువ ధరలకు లభించే ఖరీదైన మద్యం బాటిళ్లను కార్యాలయ అధికారులకు తీసుకువచ్చి ఇవ్వడమేకాక, తాను కూడా కమిషన్ తీసుకునేవాడని ఎస్‌టీఎఫ్ తెలిపింది. సమాచారం అందుకున్న ఎస్‌టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి గాగ్లాపూర్–నర్సాపూర్ హైవేపై తనిఖీలు నిర్వహించి వాహనాన్ని పట్టుకున్నారు.

ఈ కేసులో చింతల జైపాల్ రెడ్డి, బాలకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. విన్నీ కుమార్, కనుగంటి తిరుపతి పై కూడా కేసు నమోదు చేసినట్లు అంజిరెడ్డి తెలిపారు. నిందితులు మరియు స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.