అరైవ్ అలైవ్ – 2026” రోడ్డు భద్రతా కార్యక్రమాలు ప్రారంభం

భారత్ న్యూస్ డిజిటల్: హైదరాబాద్:

రామగుండం పోలీస్ కమిషనరేట్

“అరైవ్ అలైవ్ – 2026” రోడ్డు భద్రతా కార్యక్రమాలు ప్రారంభం

పెద్దపల్లి–మంచిర్యాల జోన్‌లో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

రోడ్డు భద్రత కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదు… ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

గ్రామ స్థాయిలో రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించి, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా “అరైవ్ అలైవ్ – 2026” పేరిట రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి–మంచిర్యాల జోన్‌లో 10 రోజుల పాటు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో భాగంగా, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి–మంచిర్యాల జోన్‌లో డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొని ప్రత్యేక రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోడ్డు భద్రత అనేది కేవలం పోలీస్ లేదా ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామస్థులు, యువత, వాహనదారులు అందరూ కలిసికట్టుగా రోడ్డు భద్రతకు బాధ్యత వహిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు.

సురక్షితంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను ఎలా తగ్గించవచ్చో ప్రజలకు వివరించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తొలినిమిషాల్లో అందించే ప్రాథమిక చికిత్స (BLS – Basic Life Support) అత్యంత కీలకమని, సరైన సమయంలో సరైన సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో అధికంగా ప్రాణ నష్టం జరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి వినియోగం, అతివేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపరాదనే అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు.

రోడ్డు భద్రత అనేది కేవలం పోలీస్ శాఖ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి వాహనదారుడి సామాజిక బాధ్యత అని మరోసారి గుర్తు చేస్తూ, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో భాగంగా, అదే ప్రాంతానికి చెందిన రోడ్డు ప్రమాద బాధితులు లేదా వారి కుటుంబ సభ్యుల నిజ జీవిత అనుభవాలను ప్రజలతో పంచుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే నష్టాన్ని వివరించారు. చిన్న నిర్లక్ష్యం ఎలా కుటుంబాలను జీవితాంతం బాధలోకి నెట్టేస్తుందో ప్రజలకు అవగాహన కల్పించారు.

ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మార్పు తీసుకువచ్చి, ప్రమాదాలను తగ్గించి, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు.

ఈ అవగాహన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, యువత, ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.